ఆమె ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. ఆమె భర్త ప్రైవేట్ ఉద్యోగి. రోజూ ఆమెను బైక్ పై బస్ డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తాడు, డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి తీసుకెళ్తాడు. రోజూలాగే ఈరోజు కూడా భార్యని బైక్ పై గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. ఆమెను లోపలికి పంపించి బైక్ పై బయటకు వచ్చాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. చక్రాలకింద నలిగిపోయి భర్త ప్రాణాలు వదిలాడు. భర్త శవంపై పడి భార్య రోదిస్తున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.


నెల్లూరు జిల్లా కావలికి చెందిన సుభాషిణి, సుబ్బారాయుడు దంపతులు. సుభాషిణి కావలి డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ సుభాషిణిని తీసుకొచ్చి డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తుంటాడు సుబ్బారాయుడు. ఈరోజు ఉదయం డ్యూటీ కావడంతో గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. గ్యారేజ్ నుంచి అన్ని బస్సులు బయలుదేరే సమయం అది. సుభాషిణి కూడా డ్యూటీకోసం గ్యారేజీలోకి వెళ్లింది. ఆమెను వదిలిపెట్టిన అనంతరం సుబ్బారాయుడు తిరిగి బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఎంతో సమయం పట్టలేదు. కేవలం సెకన్ల వ్యవధిలోనే అతను బస్సుకింద పడి చనిపోయాడు. డ్యూటీకి వెళ్లేందుకు లోపలికి వెళ్తున్న సుభాషిణి.. బయట జరిగిన హడావిడి చూసి పరుగు పరుగున వచ్చింది. బయట రక్తపు మడుగులో పడిన భర్తని చూసి షాక్ అయింది. అయితే అప్పటికే సుబ్బారాయుడు ప్రాణాలు వదిలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. బస్సు చక్రాలకింద బైక్ తో సహా నలిగిపోయి ప్రాణాలు వదిలాడు సుబ్బారాయుడు.




డ్రైవర్ పరారీ..


సుబ్బారాయుడి బైక్ ని ఢీకొన్నది హైర్ బస్సుగా తెలుస్తోంది. కావలి-ఒంగోలు మధ్య షటిల్ సర్వీస్ చేసే హైర్  బస్సు అది. డ్రైవర్ కూడా ప్రైవేటు వ్యక్తి. సుబ్బారాయుడు చనిపోయిన వెంటనే డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


హృదయవిదారకం..


ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరిన భార్యా భర్తలు గ్యారేజ్ కి చేరుకున్నారు, సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఫోన్ చేస్తాను అని చెప్పింది సుభాషిణి. తీసుకెళ్లడానికి వస్తానని చెప్పి, అక్కడినుంచి బైక్ తీశాడు సుబ్బారాయుడు. ఒక నిమిషం కూడా కాలేదు. అందలోనే సుబ్బారాయుడు చనిపోయాడు. ఆర్టీసీ బస్సు ఢీకొనగానే సుబ్బారాయుడు బైక్ చక్రాలకింద పడిపోయింది. అతను కూడా కిందపడ్డాడు. చక్రాలకింద నలిగిపోయాడు. ఈ ఘటన చూసి సుభాషిణి షాకయింది. యూనిఫామ్ లోనే ఉన్న ఆమె అక్కడే భర్త శవం పక్కన కూలబడిపోయి రోదిస్తున్న ఘటన అందరినీ కలచివేస్తోంది.


భార్య రోజూ డ్యూటీ చేసే ఆర్టీసీ బస్సే ఇప్పుడు ఆమె భర్త ప్రాణాలు తీసింది. డ్యూటీకి తీసుకొచ్చిన భర్త, ఇంటికెళ్లి ఫోన్ చేస్తాడనుకున్నానని, ఇలా అర్థాంతరంగా కన్ను మూస్తాడనుకోలేదని సుభాషిణి గుండెలవిసేలా రోదిస్తోంది.


ఉదయాన్నే జరిగిన ఈ ఘోరం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కావలిలో కలకలం రేపింది. సుబ్బారాయుడు, సుభాషిణి అన్యోన్యంగా ఉండేవారని, రోజూ ఆమెను విధులకు తీసుకొచ్చి, తిరిగి ఇంటికి తీసుకెళ్లేవాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. విధి వారి జీవితాలలో ఇలా చిచ్చుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.