ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున రోజా ప్రచారం చేయడంపై ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు వేశారు. వైసీపీ సినీ గ్లామర్ పై ఆధారపడిందని దెప్పి పొడిచారు. ఇప్పుడు బీజేపీ కూడా ఆత్మకూరు ప్రచారం కోసం అలనాటి హీరోయిన్ జయప్రదను రంగంలోకి దింపుతోంది. ఇటీవల ఏపీ రాజకీయాల్లో జయప్రత క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పెట్టిన సభకు ఆమె హాజరయ్యారు. తాను పుట్టిన గడ్డను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు జయప్రద. ఇప్పుడామె ఆత్మకూరు ప్రచారానికి రాబోతున్నారు. 


బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్స్.. 
ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను రప్పిస్తోంది. ఆరుగురితో బీజేపీ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ రెడీ చేసింది. వీరిలో జయప్రద, సునీల్ దియోధర్, పురంద్రీశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఉన్నారు. వీరంతా ఆత్మకూరు ప్రచారంలో పాల్గొంటారు. 


బీజేపీ షెడ్యూల్ ఇదీ..
జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి 18,19 తేదీలలో ప్రచారం నిర్వహిస్తారు
సినీ నటి జయప్రద19వ తేదీ ప్రచారం నిర్వహిస్తారు
జాతీయ కార్యదర్శి సత్యకుమార్ 19,20 తేదీలలో
రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ 19వ తేదీ
జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ 17,18 తేదీలలో ప్రచారం నిర్వహిస్తారు.
కేంద్ర మంత్రి ఎల్ మురగన్  20వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు


ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ రంగంలోకి దిగారు. విక్రమ్ రెడ్డికి పోటీగా గతంలో పలు పేర్లు వినిపించినా చివరికి ఎవరూ మొగ్గు చూపకపోవడంతో స్థానికేతరుడైన భరత్ కుమార్ ని రంగంలోకి దింపారు.  అభ్యర్థి నేరుగా మండలాల్లో తిరుగుతున్నారు. ముఖ్య నాయకులంతా ఆత్మకూరు పట్టణంలో  హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 


నిన్న మొన్నటి వరకూ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలున్నాయి. అటు వైసీపీ కూడా పదిమంది మంత్రులను రంగంలోకి దింపింది. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఓ మంత్రి వచ్చారు, ఆయనతోపాటు మరో ఇన్ చార్జి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరికి తోడు జిల్లా మంత్రి, ఇన్ చార్జి మంత్రి.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నారు. ఇక బీజేపీ తరపున సోము వీర్రాజు అంతా తానై బాధ్యత మోస్తున్నారు. వీర్రాజుతోపాటు కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. 


ఆత్మకూరులో వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ ఆశిస్తోంది. అయితే బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన శ్రేణులు సైలెంట్ గా ఉన్నా కూడా ఎన్నికలనాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.