కరోనా తర్వాత బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిధులు బాగా తగ్గిపోయాయి. కరోనా తర్వాత రక్తదానం చేయడానికి కూడా చాలా తక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రక్త నిల్వలు తగ్గిపోయి, అత్యవసర ఆపరేషన్లూ కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతున్నా కూడా రక్త నిల్వల అవసరం ఉందని అంటున్నారు నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతినిధులు. రక్తదాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
రక్తంలోని గ్రూపులు కనుగొన్న శాస్త్రవేత్త, రక్త మార్పిడి వైద్య పితామహులు డాక్టర్ కార్ల్ ల్యాండ్ స్టైనర్ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిధి ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈఏడాది కూడా రక్తదాతల దినోత్సవాన్ని నెల్లూరులోని రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఘనంగా జరిపారు. రెడ్ క్రాస్ సంస్థలో ఉన్న కార్ల్ ల్యాండ్ స్టైనర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదాతలకు, మోటివేటర్లకు ప్రశంసా పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి. చంద్ర శేఖర్ రెడ్డి, ట్రెజరర్ సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రక్తనిధి కన్వీనర్ అజయ్ రక్తనిల్వలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. నెల్లూరు బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, తలసేమియా పిల్లలకు, అత్యవసరమైన నిరుపేదలకు సైతం రక్తాన్ని అందించడం కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పారు. అయినా కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. మోటివేటర్ల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.
రక్త దాతలు సకాలంలో అందించిన రక్తంతో నిరుపేదలకు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థని అభినందించారు డీఎంహెచ్ఓ వెంకట ప్రసాద్. ఇటీవలే నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి గవర్నర్ తరపున ప్రశంస లభించింది. రాష్ట్రవ్యాప్తంగా రక్తనిధుల కొరత ఉందని తెలిపారు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులు చేత ప్రతి సంవత్సరం కనీసం 3 సార్లు రక్త దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది, లైఫ్ మెంబెర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.