ఇది ఓ దారుణ ఘటన. సభ్య సమాజం తలదించుకునే ఘటన. మనుషులపై కుక్కలతో దాడి చేయించారు. అవును, కుక్కని ఉసిగొల్పి ఆ వ్యక్తి కండను చీల్చేలా చేశాడు. ఇదెక్కడో సినిమాలో జరిగిన సంఘటన కాదు, నెల్లూరు జిల్లాలో జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షి తాయి ఆలయ ఆవరణ సమీపంలోనే ఈ ఘటన జరగడం మరీ దారుణం. 


నెల్లూరు జిల్లా, బుచ్చి రెడ్డి పాలెం మండలం జొన్నవాడలో కామాక్షితాయి సన్నిధి వద్ద యాచకులు కనిపిస్తుంటారు. ఇటీవల ఇద్దరు యాచకులు అక్కడికి కొత్తగా వచ్చారు. ఈ క్రమంలో వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు వారిని తరిమికొట్టారు. రమేష్ అనే వ్యక్తి మాత్రం యాచకులలో ఒకరిని కుక్కతో కరిపించాడు. ఒకరు పారిపోగా మరొకరు రమేష్ కి దొరికారు. తన పెంపుడు కుక్కని గొలుసుతో తీసుకొచ్చిన రమేష్.. ఆ యాచకుడిపైకి కుక్కను ఉసిగొల్పాడు. 


యాచకుడిని రమేష్ తీవ్రంగా కొట్టి హింసించాడు. మెడకు గొలుసు వేసి లాగడమే కాకుండా, కుక్కను ఉసిగొల్పి హింసించాడు. అందరి ముందు ఇలా క్రూరంగా ప్రవర్తించాడు రమేష్. అతిని క్రూరత్వాన్ని మరొకరు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియోలు స్థానికంగా వైరల్ గా మారాయి. దీంతో చాలామంది రమేష్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. 


పోలీసులకు తెలిసినా ఫలితం లేదు..
యాచకుడిని దొంగగా అనుమానిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి, లేదా దొంగతనం చేసి ఉంటే పోలీసులకు కంప్లయింట్ చేయాలి. కానీ రమేష్ మాత్రం తానే స్వయంగా వచ్చి దొంగగా అనుమానిస్తున్న యాచకుడిని చితగ్గొట్టాడు. కుక్కతో కరిపించాడు. 


దారుణంపై ఫిర్యాదు లేదు..
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టి ఈ ఘటనపై పడింది. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుండే సరికి పోలీసులు కూడా దీనిపై దృష్టిపెట్టారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, తనకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆ యాచకుడు అక్కడ లేడు. కుక్కతో కరిపించినా, గొలుసు మెడ చుట్టూ వేసి కట్టేసినా ఆ హింసను భరించాడు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. 


నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణ ఘటనలు జరగలేదు. ఇప్పుడు సెల్ ఫోన్ పుణ్యమా అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో.. అందరికీ దీని గురించి తెలిసింది. మనుషులపైకి కుక్కని ఉసిగొల్పడం ఏంటా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు కానీ సైలెంట్ గా ఉన్నారు. బాధితుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో వీడియో వైరల్ గా మారినా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. మరోవైపు ఈ ఘటన అమ్మవారి గుడిముందు జరగడం దారుణం అంటున్నారు స్థానికులు.