ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ఆరు గంటలనుంచి ఏడు గంటల వరకు మాక్ పోలింగ్ చేపట్టారు. అనంతరం ఏడుగంటలనుంచి పోలింగ్ మొదలైంది. ఆత్మకూరులో మొత్తం 279 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆరు మండలాలకు సంబంధించి 377 ఈవీఎంలతో పోలింగ్ జరుగుతోంది. 1132 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో 148 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. 2,13,338 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.
14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో నిలిచారు. మొత్తం 14మంది అభ్యర్థులు ఈరోజు ఉప ఎన్నికల పోటీలో ఉన్నారు. 2,13,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
ఆత్మకూరు ప్రశాంతంగానే కనిపిస్తున్నా.. పోలింగ్ కేంద్రాల్లో 44 శాతం సమస్యాత్మకమైనవేనని అధికారులు నిర్థారించారు. మొత్తం 6 మండలాల్లో 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 123 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు అక్కడ అదనపు బలగాలను మోహరించారు. టీడీపీ పోటీలో లేకపోవడంతో గొడవలు జరిగే అవకాశం లేదని అనుకున్నా.. స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పోలీసులు ముందు జాగ్రత్త తీసుకున్నారు. 123 కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
పోలింగ్ శాతంపై సందేహం..
విజయంపై ఇప్పటికే ధీమాగా ఉన్న అధికార వైసీపీ.. లక్ష మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. పోలింగ్ శాతం వీలైనంత మేర పెంచేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఆ స్థాయిలో పోలింగ్ కి జనం ఆశక్తి చూపిస్తారా లేదా అనేది సందేహమే. ఇప్పటికే పల్లెల్లో చాలామంది నర్రవాడలో జరిగే వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నవారు కూడా గత ఎన్నికలకోసం తరలి వచ్చినట్టు ఈసారి రావడంలేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతుందనే అంచనాలున్నాయి.
వాతావరణంలో మార్పు..
నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోతున్నా.. రాత్రి నుంచి వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉన్నట్టుండి భారీ వర్షం పడింది. ఈరోజు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షం పడితే ఓటింగ్ శాంత తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యే అవకాశముంది.