ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇంకా అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి దూరమయ్యాక నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇక్కడ వైసీపీ ఇన్ చార్జ్ గా నియమించారు. దాదాపు ఆయనకే టికెట్ ఖరారు చేస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మీ ప్రియని ప్రకటించింది. ఆమె మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె. అత్తగారి ఇంటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. కచ్చితంగా బలమైన అభ్యర్థి అనే పేరొచ్చేసింది. ఈ దశలో నేదురుమల్లి అభ్యర్థిత్వాన్ని చాలామంది వైసీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే వెంకటగిరిలో గట్టిపోటీ ఇవ్వడం కష్టం అని చెబుతున్నారు.
రాజకీయ వారసత్వం ఉంది కానీ..
వాస్తవానికి వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి.. ఇద్దరూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వారి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ నియోజకవర్గంపై పట్టు చిక్కలేదు. ఇప్పుడు కూడా ఆయన్ను ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేయొద్దని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేయడం గమనార్హం. నేదురుమల్లికి రాజకీయ వారసత్వం ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పట్టు లేకపోవడంతో ఆయనకు ప్రత్యేక వర్గం అంటూ లేకుండా పోయింది. వైరి వర్గాలు ఎక్కువయ్యాయి.
పెద్దిరెడ్డి వద్దకు పంచాయితీ..
ప్రస్తుతం వెంకటగిరి పంచాయితీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వద్దకు చేరింది. ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంటనే పక్కనపెట్టాలని కొంతమంది పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డిని వెంకటగిరి నేతలు కలిశారు. నియోజకవర్గంలోని 6 మండలాల సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో కలసిన ఓ బృందం పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసింది. నేదురుమల్లికి టికెట్ ఇస్తే తాము వైసీపీని వీడిపోతామని వారు స్పష్టం చేశారు. నేదురుమల్లి పోటీ చేస్తే ఓటమి ఖాయని కూడా వారు తేల్చి చెప్పారు. పెద్దిరెడ్డి వారిని సముదాయించి పంపించారు. తనకు ఒకరోజు గడువు ఇవ్వాలని కోరారు.
కిం కర్తవ్యం..?
నేదురుమల్లి కాకుండా ఇప్పటికిప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని నిలపడం వైసీపీకి కత్తిమీద సాములా మారింది. నేదురుమల్లిపై ఫిర్యాదు చేస్తున్న వైరి వర్గం కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. బీసీ అభ్యర్థి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద పేరుని పరిశీలించాలనుకున్నా.. ఆమెకు చేనేత వర్గం ఓట్లు పడినా మిగతా వర్గాలు దూరం పెడతారేమోననే అనుమానం ఉంది. వెంకటగిరి రూరల్ లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. అవన్నీ కురుగొండ్లకు వన్ సైడ్ గా పడేవే. కానీ 2019లో ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడకు రావడంతో కురుగొండ్లకు షాక్ తప్పలేదు. ఈసారి వైసీపీ తరపున నేదురుమల్లి అభ్యర్థి అయితే.. కురుగొండ్ల కుమార్తెకే విజయావకాశాలు ఎక్కువ అని అంటున్నారు. రాగా పోగా వెంకటగిరి రాజాల వైపు వైసీపీ దృష్టి సారించవచ్చు.
వెంకటగిరి రాజా వారసులు ఓకే అంటే.. వెంకటగిరిలో వారికే గెలుపు అవకాశాలుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారు పోటీకి విముఖత చూపే అవకాశమే ఎక్కువ. గట్టి పోటీ ఎదురవుతుందనుకుంటే మాత్రం పరువు పోగొట్టుకోడానికి వెంకటగిరి రాజాలు ధైర్యం చేయకపోవచ్చు. అందుకే వైసీపీకి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇప్పుడు అక్కడ బడా నేతగా కనపడుతున్నారు. మరి వైరి వర్గానికి వైసీపీ అధిష్టానం ఎలా సర్దిచెబుతుందో చూడాలి.