ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్షపై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సెటైర్లు పేల్చారు. అది జలదీక్ష కాదని, పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. దీక్షలు చేయాలనుకున్నవారు ఇంత ఆర్భాటంగా, ప్రచారం చేసుకుంటూ మందీమార్బలం వెంటేసుకుని రారని, పోలీసులు అడ్డుకుంటారని తెలిసే కోటంరెడ్డి దీక్షకు పిలుపునిచ్చారని, చివరకు దాన్ని కూడా ప్రచారంగా మార్చుకున్నారని చెప్పారు కాకాణి. 


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి కనపడలేదా అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్ష చేపట్టాలనుకోవడం, దాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన స్పందించారు. అది జలదీక్ష కాదని, కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు సీఎం జగన్ దగ్గరకు వెళ్లి కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా అన్నారు, ఇప్పుడు పార్టీనుంచి బయటకొచ్చాక దీక్షల పేరుతో హడావిడి ఎందుకన్నారు. పార్టీనుంచి బయటకు వెళ్లిపోతే మంచిదేనని, కానీ తమపై బురద చల్లాలనుకోవడం సరికాదన్నారు. 


నెల్లూరు జిల్లాలో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ ముగ్గురిలో మిగతా ఇద్దరు పిలుపు ఇస్తే ఎంతమంది కార్యకర్తలు వెంట వస్తారో తెలియదు కానీ, కోటంరెడ్డి పిలుపునివ్వడంతో వందలాదిమంది అభిమానులు ఆయనకోసం తరలి వచ్చారు. వేలాది మంది సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా పోస్టింగ్ లు పెట్టారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడంతో.. టీడీపీ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. దీంతో ఆయన జలదీక్షకు భారీగా జన సమీకరణ చేయాలనుకున్నారు. అయితే చివర్లో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. 


జలదీక్ష జరగబోయే ముందు వరకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. తీరా కోటంరెడ్డి ఇంటి నుంచి దీక్ష కోసం పొట్టేపాలెం కలుజు వద్దకు వెళ్తారనగా ఆ ఇంటిని ని పోలీసులు చుట్టుముట్టారు. బయటకు కదలనివ్వలేదు. ఇంటికొచ్చి నోటీసులిచ్చారు. దీంతో కోటంరెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటి దగ్గరే తాను దీక్ష చేపడతానంటూ కూర్చున్నారు. 


రూరల్ పై పట్టుకోసం..


మరోవైపు నెల్లూరు రూరల్ పై పట్టుకోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఎంపీ ఆదాలను ఇన్ చార్జ్ గా ప్రకటించారు సీఎం జగన్. ఆదాల ఎంపీ కావడంతో ఇటీవల పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆయన ఢిల్లీలో బిజీగా గడిపారు. ఇప్పుడాయన నెల్లూరుకి వచ్చారు. ఆయనతో కలసి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కూడా నెల్లూరు రూరల్ లో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని కూడా నెల్లూరు రూరల్ నుంచే ప్రారంభించారు. నెల్లూరు రూరల్ లో వైసీపీ, కోటంరెడ్డి వర్గాలు పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. 


పార్టీకి దూరం జరిగినా నిరంతరం ప్రజల్లో ఉండేందుకు కష్టపడుతున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అటు టీడీపీలో చేరకుండా, ఆ పార్టీ కండువా కప్పుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానంటున్నారు. రూరల్ లో టీడీపీ టికెట్ కోసం ముందుగానే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ఆ పార్టీలోకి పంపించారు. సరిగ్గా ఎన్నికల వేళ కోటంరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఆలోగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రజా పోరాటాల పేరుతో కోటంరెడ్డి జనంలోకి వెళ్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది.