నెల్లూరు పర్యటనలో చంద్రబాబు టిడ్కో ఇళ్ల దగ్గర నిలబడి సెల్ఫీ దిగి సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. చంద్రబాబుకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను ఆయన ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ అసంపూర్తిగా వదిలేసిన నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ లను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని, వాటి వద్ద కూడా నిలబడి చంద్రబాబు సెల్ఫీలు దిగితే బాగుండేదని చురకలంటించారు. 


చంద్రబాబు నెల్లూరు వచ్చారంటేనే జిల్లా వాసులు బెంబేలెత్తుతారని సెటైర్లు పేల్చారు కాకాణి. నెల్లూరులో అభివృద్ధి ఏమీ చేయలేదు కాబట్టి సెల్ఫీ ఛాలెంజ్ అని టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ తీసి పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి సిగ్గు, శరం ఉంటే ఐదేళ్లలో వాళ్లు కట్టిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కేవలం కమీషన్ల కోసమే టిడ్కో ఇళ్లు నిర్మించారని ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసన్నారు కాకాణి. చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈడీ విచారణ చేస్తుంటే బాబు అవినీతి బాగోతం ఒక్కకొక్కటిగా బయటపడుతోందన్నారు. ఐదేళ్లలో ఇళ్లు ఇవ్వలేకపోయాను అని సెల్ఫీ పెట్టాల్సింది అంటూ కౌంటర్‌ ఇచ్చారు కాకాణి. 


మేం ఏం చేశామో తెలుసా బాబూ..!
తమ ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చామో చంద్రబాబున్నారు కాకాణి.  సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి వద్ద సెల్ఫీ తీసుకుని సిగ్గుపడాలి అంటూ చురకలంటించారు. ఆయన చేయలేకపోయిన పనుల్ని తాము చేసి చూపించినందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 


దరిద్రం, అరిష్టం, కరువు, కాటకాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు కాకాణి. అలాంటి బాబు.. సీఎం జగన్ ని దరిద్రం, అరిష్టం అనడం సరికాదన్నారు. ఓడిపోతారని తేలడం వల్లే పంచాయతీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా పలాయనం చిత్తగించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని నమ్మి ఎంతమంది రోడ్డున పడ్డారో, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో తెలుసుకోవాలన్నారు.


వాలంటీర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడటం దారుణమన్నారు కాకాణి. ప్రజలు ఆయ పక్కన ఉంటే 2019లో 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చుట్టూ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని, ఆయన రౌడీయిజం గురించి సిగ్గులేకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు మంత్రి కాకాణి.. టీడీపీ సోషల్ మీడియాలో తప్ప జనాల్లో ఎప్పుడో చచ్చిపోయిందని సెటైర్లు వేశారు. నువ్వే మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు కాకాణి. సమస్యల పరిష్కారానికి టీడీపీ కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుందట. అసలు ఈయన అధికారంలోకి ఎప్పుడు రావాలి? అని ఎద్దేవా చేశారు కాకాణి. సర్వేలో గెలవబోమనే సీట్లని బీసీలకి ఇవ్వడం చంద్రబాబుకు అలవాటన్నారు. 


తన కూతురుని చంద్రబాబుకి ఇచ్చి పెళ్లిచేయడమే ఎన్టీఆర్ చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి. ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని చంద్రబాబు చేస్తానంటే పైనున్న ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందన్నారు. చంద్రబాబుకు కమిట్మెంట్ అనే పదం పలకడానికి కూడా అర్హతే లేదన్నారు కాకాణి. సీఎం జగన్ లాంటి వ్యక్తిని క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు అంటున్నాడని, జగన్ పై నిలువెత్తు విషం దాచుకున్న చంద్రబాబు మాటల్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 


చంద్రబాబు వై నాట్ పులివెందుల అంటున్నాడని ఆయన స్థాయి పులివెందుల వరకేనన్నారు. మేం వై నాట్ 175 అంటున్నాం అన్నారు కాకాణి. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విషాదం అని ఎద్దేవా చేశారు. కందుకూరులో కాలు పెట్టి, 8 మందిని చంపేశారని చెప్పారు. అసలు 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేసే దమ్ముందా అన్నారు కాకాణి.