Kakani challenges Chandrababu: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుకి సవాల్ విసిరారు. మేనిఫెస్టో విషయంలో దమ్ముంటే తన సవాల్ ని అంగీకరించాలన్నారు. నిత్యం అసత్యాలు ప్రచారం చేసే చంద్రబాబుకి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు కాకాణి.
టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచిన కుప్పంకి వెళ్దామా, అచ్చెన్నాయుడు గెలిచిన టెక్కలికి వెళ్దామా.. చంద్రబాబుకి చీము, నెత్తురు ఉంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడికైనా వెళ్లి మేనిఫెస్టోపై చర్చిద్దామన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆ రెండు కాకపోతే, టీడీపీ చూపించిన ఏ నియోజకవర్గానికైనా వెళ్లి, ఏ గ్రామంలో అయినా చర్చ పెడతామని తన సవాల్ స్వీకరించాలన్నారు. టీడీపీ మేనిఫెస్టోని వెబ్ సైట్ లో దొరక్కుండా మాయం చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టో 99శాతం అమలు చేశామని చెప్పారు. అసెంబ్లీకి వచ్చినా చర్చ మొదలు పెడతామన్నారు. చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితం అబద్దాలమయం అని, జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటు అన్నారు కాకాణి.
హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్య నాదెళ్ల సీఈఓ గా ఎదిగారని గతంలో చంద్రబాబు ఓ మీటింగ్ లో చెప్పిన వీడియోని తన ప్రెస్ మీట్ లో ప్రసారం చేశారు కాకాణి. ఇంతకన్నా పచ్చి అబద్ధం వేరేది ఉందా అని మీడియాని ప్రశ్నించారు. 1992లోనే మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ల చేరారని, అప్పటికి చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కాలేదని గుర్తు చేశారు. అప్పటికి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రాలేదన్నారు. ఆ విషయం అందరికీ తెలిసినా.. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట కాబట్టి, అదే నిజమని నమ్మేలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు.
అబద్దానికి ప్యాంటు.. షర్ట్ వేస్తే అదే చంద్రబాబు అని సెటైర్లు పేల్చారు మంత్రి కాకాణి. దేశంలో జాతీయ రహదారులు వేసే విషయం కూడా తానే వాజ్ పేయికి చెప్పానని కూడా చంద్రబాబు చెప్పుకుంటారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన విషయం చూస్తే ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. ఆ వీడియోని కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ లో మీడియాకు చూపించారు. చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా అని ప్రశ్నించారు. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంను జగన్ తీసుకొస్తే దానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చార్జ్ షీట్ వేసేందుకు మీకేం అర్హత ఉంది..
వైసీపీ మీద చార్జ్ షీట్ వేయడానికి టీడీపీ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు మంత్రి కాకాణి. టీడీపీ లాగా తాము మేనిఫెస్టోని దాచలేదని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించారని చెప్పారు. మేనిఫెస్టో ను చేతిలో పట్టుకుని ఇంటింటికి వెళ్లి ఏ ఏ పథకాలు వచ్చాయనే విషయాన్ని ఆరా తీస్తున్నామని, చంద్రబాబు ఏ రోజైనా మేనిఫెస్టోకు గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు.
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 650 వాగ్దానాలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదన్నారు కాకాణి. నవరత్నాలు ఇస్తామని చెప్పి తాము వాటన్నిటినీ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టో ఎలా అమలైంది, వైసీపీ మేనిఫెస్టో ఏవిధంగా అమలైందో చూద్దామని సవాల్ విసిరారు. అన్ని వర్గాల వద్దక వెళ్లి పరిశీలిద్దాం రండి అంటూ చంద్రబాబుకి సవాల్ విసిరారు. బిందు సేద్యం టీడీపీ ప్రభుత్వం 1250 కోట్లరూపాయలు ఇచ్చిందని లోకేష్ యువగళంలో చెబుతున్నారని, చంద్రబాబు
దిగిపోయే సమయానికి రూ. 800 కోట్ల బకాయిలు పెట్టారని, అదే అసలు నిజం అని అన్నారు. చంద్రబాబు ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి రూ.2 వేల కోట్లను జగన్ ప్రభుత్వం బిందు సేద్యానికి కేటాయించిందని గుర్తు చేశారు. ఆ విషయంపై చర్చించేందుకు దమ్ముంటే లోకేష్ రావాలని కోరారు.
బిందు సేద్యం అమలుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం అవార్డులు ఇచ్చిందని, టీడీపీ హయాంలో ఎప్పుడూ ఆ అవార్డులు రాలేదన్నారు కాకాణి. నారా లోకేష్ పాదయాత్ర ప్లాప్ షో గా మారిందన్నారు. పోర్ట్ ప్రాంతంలో జనాలు దొరక్క, వివిధ కంపెనీల కూలీలను లోకేష్ యాత్రకు తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు.