Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను తుపాను భయపెడుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు ఆయా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని అంచనా వేస్తోంది. అంతే కాకుండా అత్యవసరంగా ఖర్చు పెట్టేందుకు నిధులు కూడా విడుదల చేసింది. 


జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, సత్యసాయి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే ప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. 


జోరు వానలతో స్తంభించన జనజీవనం 


ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. తెల్లవారుజామున మొదలైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఆ జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 






ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న జిల్లా యంత్రాంగం


మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 


48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన 






రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. మండల, గ్రామస్థాయి అధికారులు వారి హెడ్‌ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించింది. గాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని వాటిని వెంటనే పునరుద్ధరించే చర్యలకు సిద్ధంగా ఉన్నారు. 


ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు 


బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. తీరం వెంట గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పాఠశాలలకు  మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 






Also Read: ఫ్లెక్లీలపై ప్రధాని, సీఎం ఫొటోలు ఉండాల్సిందే- అధికారులను ఆదేశించిన పవన్