ఈ దేశానికి కాబోయే ప్రధాని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని అంటున్నారాయన. విడవలూరు మండలంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ దేశానికి కాబోయే ప్రధాని అంటూ వ్యాఖ్యానించారు. వచ్చేసారి కూడా ప్రజలు జగన్ కి పట్టాభిషేకం చేసేందుకు రెడీ అయ్యారని చెప్పారు. ఏదో ఒకరోజు ఈ దేశానికి జగన్ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఏపీ పథకాల స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు అబద్ధాలతో కాలక్షేపం చేస్తే, జగన్ సుపరిపాలనతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి.
ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనమే..
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా కలకలం రేగుతూనే ఉంటుంది. సీఎం జగన్ ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న సందర్భంలో జగన్ దేశానికి ప్రధాని కావాలంటూ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే టీఆర్ఎస్ కి ఉన్న ఎంపీ సీట్లు కేవలం 9. ఆ లెక్కన చూస్తే ఏపీలో వైసీపీ 22 స్థానాల్లో గెలిచింది. టీఆర్ఎస్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ. ఇలా చూస్తే ప్రసన్న ఆలోచన, ఆశ.. మరీ అతిశయోక్తిలా అనిపించదు కానీ.. జగన్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.
పొగిడి జగన్ ఆగ్రహానికి గురైన ప్రసన్న కుమార్ !
ఇటీవల కాలంలో సీఎం జగన్ ని పొగిడే విషయంలో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. గతంలో ప్రసన్న కుమార్ తొందరపాటు వల్ల కొన్ని సందర్భాల్లో జగన్ ఆగ్రహానికి గురయ్యారని కూడా అంటారు. జగనన్న కాలనీల్లో ఇచ్చే ఇంటి పరిమాణం సామాన్య కుటుంబానికి సరిపోదంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ తర్వాత గడప గడప కార్యక్రమం విషయంలో కూడా జనంలోకి వెళ్లకుండా సీఎం జగన్ తో చీవాట్లు తిన్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఆ తర్వాతే ఆయన స్పీడ్ పెంచారు. గడప గడప కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం జగన్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.
కోవూరులో కొత్త వ్యక్తికి సీటిస్తారా..
2024 ఎన్నికల్లో ప్రస్తుతం వైసీపీకి ఉన్న 151 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది. నెల్లూరు జిల్లాలో అలా మార్పులు చేర్పులు జరిగే సీట్లలో కోవూరు కూడా ఉందని అంటున్నారు. కోవూరుకి కొత్త అభ్యర్థిని తెచ్చిపెడతారేమోననే అనుమానం ప్రసన్నలో కూడా ఎక్కువైనట్టు తెలుస్తోంది. అందుకే ఆయన జగన్ మెప్పుకోసం ఇటీవల గడప గడపలో స్పీడ్ పెంచారు. మిగతా ఎమ్మెల్యేలకంటే హుషారుగా పని చేస్తున్నారు. గతంలో పెన్నా నదికి వరదలు వచ్చిన సమయంలో కూడా ఆయన సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా.. మిగతా ఎమ్మెల్యేల స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా జగన్ దృష్టిలో పడాలని ఫిక్స్ అయ్యారు. ఏకంగా ఆయన్ను ప్రధాన మంత్రి అభ్యర్థిని చేసేశారు. జగన్ ఎప్పటికైనా ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.