Nellore Politics: మేకపాటి కుటుంబానికి మరోసారి సముచిత ప్రాధాన్యత కల్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019లో మేకపాటి కుటుంబం తరపున నెల్లూరు జిల్లానుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు, ఆయన మరణం తర్వాత ఆ సీటు మేకపాటి విక్రమ్ రెడ్డికి దక్కింది, కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు. ఇక ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు కానీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ తో ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొనడంతో చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జ్ గా మేకపాటి కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో 2024 ఎన్నికల్లో మరోసారి మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు ఖాయం చేసినట్టు తేలిపోయింది.
వైసీపీ ఆవిర్భావంలో సీఎం జగన్ తో కలసి నడిచారు అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీలోకే వచ్చారు. ఆ తర్వాత రాజమోహన్ రెడ్డి స్థానంలో ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి వచ్చారు, గౌతమ్ మరణంతో మరో తనయుడు విక్రమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు. ఇక చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఉదయగిరికి చాలామంది ఇన్ చార్జ్ పోస్ట్ కోసం ట్రై చేశారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు దాదాపుగా ఖాయమైందని అనుకున్నారంతా. ఆ తర్వాత మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, చిరంజీవి రెడ్డి పేర్లు వినిపించినా ఎవరినీ ఖాయం చేయకుండా చాన్నాళ్లుగా నెట్టుకొచ్చారు జగన్. చంద్రశేఖర్ రెడ్డితోపాటు పార్టీనుంచి సస్పెండ్ అయిన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల స్థానాల్లో వెంట వెంటనే ఇన్ చార్జ్ లు పుట్టుకొచ్చారు కానీ, ఉదయగిరి మాత్రం అప్పటినుంచి ఖాళీగా ఉంది. ఇప్పుడది తిరిగి మేకపాటి కుటుంబానికే దఖలు పడింది.
రాజమోహన్ రెడ్డి మంత్రాంగం..
ఉదయగిరికి ఇన్ చార్జ్ గా వేరే నాయకుడిని ప్రకటిస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో గతంలో రాజమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి భ్రష్టుపట్టి పోయారని, అందుకే జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారని, కనీసం ఎమ్మెల్సీ తీసుకుని అయినా సర్దుకుపోయి ఉండాల్సిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటువేసి శేఖర్ రెడ్డి పెద్ద తప్పు చేశారని గతంలో తీవ్ర విమర్శలు చేశారు రాజమోహన్ రెడ్డి. అప్పట్లో ఆయన ఉదయగిరి సీటు విషయంలో కూడా కీలక కామెంట్లు చేశారు. ఉదయగిరి సీటుకి వైసీపీ తరపున తాను రచనా రెడ్డి పేరు రికమెండ్ చేస్తానన్నారు. రచనా రెడ్డి కాకపోతే తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అలియాస్ రాజారెడ్డికి ఆ సీటు ఇవ్వాలన్నారు.
రచనారెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోడలు కూడా. అయితే ఆమె విషయంలో జగన్ ఎందుకో వెనకడుగు వేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి మరోసోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఆ స్థానం ఖరారు చేశారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి అలియాస్ రాజారెడ్డిని ఉదయగిరి ఇన్ చార్జ్ గా ప్రకటించారు. 2024లో ఆ స్థానంలో రాజారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తేలిపోయింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial