ఈనెల 27న నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు సీఎం జగన్. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్ ని ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పర్యవేక్షించారు.




అడ్డుకుంటాం..


ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు వామపక్షాల నేతలు. వారికి టీడీపీ, జనసేన, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంది. జెన్ కోని ప్రైవేటుపరం చేస్తున్నారన్న సమాచారంతో ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. జెన్ కో పర్యవేక్షణకు వచ్చిన అధికారుల కార్లను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు.




ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికాగా ప్రస్తుతం టెస్ట్ రన్ జరుగుతోంది. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ పనిచేస్తోంది.




థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు కాగా, పరీక్షల సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ, జనరేటర్‌ లోపాలు, అలైన్‌మెంట్‌ వంటి సమస్యలు వచ్చాయి. ఇంజినీర్లు వాటన్నింటిని గుర్తించి పరిష్కరించగలిగారు. మొదట్లో బొగ్గు కొరత ఉన్నా కూడా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత బొగ్గు నిల్వలు సమకూర్చుకోగలిగారు. కృష్ణపట్నం ఓడరేవు నుంచి కన్వేయరు బెల్ట్‌ ద్వారా బొగ్గు సరఫరా... ఇలా అన్ని అనుకూల అంశాలు ఈ ప్రాజెక్ట్ కి ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకోసం, పవర్‌ హౌస్‌, బొగ్గు యార్డు కూడా ఇక్కడ రూపుదిద్దుకుంది. 


మరోవైపు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ని 28 సంవత్సరాలపాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చేందుకు కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ దశలో మూడో యూనిట్ కూడా పూర్తి కావడం, ఈ నెల 27న దీన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడటంతో.. అధికారులు హడావిడి పడుతున్నారు. సీఎం జగన్ టూర్ కి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేపట్టారు.