ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కావలిలో పర్యటించనున్నారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30కి తాడేపల్లిలో బయల్దేరి 10.30కు కావలి చేరుకుంటారు. కావలిలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే రైతులకు పట్టాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తాడేపల్లి తిరిగి చేరుకుంటారు. 


ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే 


సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పరిశీలించారు. కలెక్టర్ హరినారాయణన్‌, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సీఎంవో ఇంటెలిజెన్స్ అధికారి గోపాల్ కృష్ణ కలిసి ఆ ప్రాంతంలో కలియదిరిగారు. హెలిప్యాడ్ పనులను, సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగ సభ, పార్కింగ్‌ ఏర్పాట్లపైకూడా ఆరా తీశారు. 


సీఎం పర్యటన సందర్భంగా బహిరంగ సభకు వచ్చే లబ్ధిదారులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం స్థానిక అధికారులకు  సూచించింది. వచ్చే ప్రజలు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా 40 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. 


ఇవాళ వైజాగ్‌ టూర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు విశాఖకు రాబోతున్నందును ముఖ్యమంత్రి జగన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించ నున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. 


వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైజాగ్ స్టాండ్స్ విత్ యూ.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినదిస్తున్నారు. ఆయన ఈరోజు విశాఖకు వస్తున్నందున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్ ను కొందరు ప్రజలు స్వచ్ఛద్ధంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఈరోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లలో పాల్గొంటారు. 


మే 24న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టూర్


తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు.