ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలో వరుస దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. CISF సిబ్బంది ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిన విషయమే. అందులో ఎస్సై వికాస్ సింగ్ కూడా ఉన్నారు. వికాస్ సింగ్ మరణ వార్త తెలిసిన అతని భార్య ప్రియాంక సింగ్.. మృతదేహాన్ని చూసేందుకు ఉత్తర ప్రదేశ్ నుంచి శ్రీహరికోట వచ్చారు. వికాస్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో తనను తానే కాల్చుకుని చనిపోయారు. సెలవల విషయంలో మనస్తాపానికి లోనై అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరో దారుణం జరిగింది. వికాస్ సింగ్ భార్య కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ లో మరొక దారుణం వెలుగు చూసింది. వికాస్ సింగ్ మృతదేహాన్ని చూసేందుకు నిన్న రాత్రి అతని భార్య యూపీ నుంచి బయలుదేరి శ్రీహరి కోటకు వచ్చారు. ఆమె పేరు ప్రియాంక సింగ్. ఆర్థిక సమస్యలతోపాటు కొడుకు అనారోగ్యం వల్లే తన భర్త సూసైడ్ చేసుకున్నారని ఆమె అక్కడి సిబ్బందితో చెప్పినట్టు సమాచారం. వికాస్ సింగ్ కి మొత్తం ముగ్గురు పిల్లలున్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నారు. వారి బాగోగులను భార్య ప్రియాంక సింగ్ చూసుకుంటున్నారు. అయితే ఒక పిల్లవాడికి తీవ్ర అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పైగా సెలవు కోసం ప్రయత్నించి అతను విఫలమయ్యాడు. దీంతో మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే డ్యూటీలో ఉండగానే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు వికాస్ సింగ్.
భర్త మరణ వార్త వినగానే ప్రియాంక సింగ్ హుటాహుటిన బయలుదేరి శ్రీహరికోటకు వచ్చారు. నర్మదా గెస్ట్ హౌస్ లో ఆమె ఉన్నారు. అక్కడే ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం గెస్ట్ హౌస్ సిబ్బంది రూమ్ దగ్గరకు రావడం, తలుపు ఎంతకీ తీయకపోవడంతో లోపల ఏదో జరిగిందని అనుమానంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల ఫ్యాన్ కి ఉరి వేసుకున్న స్థితిలో ప్రియాంక కనపడ్డారు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారమిచ్చారు.
అనాథలైన పిల్లలు..
అసలే పిల్లవాడికి అనారోగ్యం, దీనికి తోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో క్షణికావేశంలో వికాస్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇప్పుడు అతని భార్య కూడా చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. మూడు నెలల క్రితమే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ గా ఉన్న వికాస్ సింగ్ శ్రీహరికోటకు బదిలీపై వచ్చారు. విధుల్లో ఉన్నప్పుడు చురుగ్గానే ఉండేవాడని సహచర సిబ్బంది చెబుతున్నారు. అతను మరణించిన రోజు కూడా హుషారుగానే విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ సమస్యలతో తీవ్రంగా సతమతం అయిన వికాస్ సింగ్ చనిపోవడం దురదృష్టకరం. అతని మృతితో మనోవేదనకు గురైన భార్య ప్రియాంక సింగ్ కూడా చనిపోవడం మరో దారుణం. వరుస దుర్ఘటనలతో షార్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. వికాస్ సింగ్ భార్య మృతిపై.. యూపీలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు షార్ సిబ్బంది సమాచారమిచ్చారు.