వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను రద్దు చేసింది. సంక్షేమ పథకాలతో పేదలకు అన్నీ సమకూరుస్తున్నప్పుడు ఇక క్యాంటీన్లు ఎందుకంటూ క్యాంటీన్ వ్యవస్థను రద్దు చేసింది. అయితే టీడీపీ మాత్రం 5 రూపాయలకే నిరుపేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారంటూ మండిపడుతోంది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇటీవల అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కొన్నిచోట్ల రాద్ధాంతం కూడా జరిగింది. నెల్లూరులో కూడా కొంతమంది టీడీపీ అభిమానులు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణం బయట ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కూర అన్నం, పెరుగు అన్నం 5 రూపాయలకే అందిస్తున్నారు. 5 రూపాయలు కూడా ఇవ్వలేని పేదలకు ఉచితంగానే అన్నం పెడుతున్నారు. 




ఉచితంగా పెడుతున్నా కూడా అన్నం బాగుందని, పేదల కడుపు నింపుతోందని చెబుతున్నారు ఇక్కడ భోం చేస్తున్నవారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలు, వారి బంధువులు, ఆటో డ్రైవర్లు.. కూడా ఇక్కడ భోజనం చేస్తుంటారు. 


చంద్రబాబు సీఎం అయ్యేంత వరకు ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు నిర్వాహకులు. ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఎత్తివేయడం దారుణం అంటున్నారు. అయితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా తాము చేయాలనుకుంటున్న పనిని చేస్తామని చెబుతున్నారు. ఖర్చు ఎక్కువ అవుతున్నా.. సేవా భావంతో తమ స్నేహితులందరూ కలసి ఇక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. 




అన్న క్యాంటీన్ల వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం మాత్రం సీరియస్ గా తీసుకోవడంలేదు. ఇప్పటికే ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇక అన్న క్యాంటీన్లు అవసరం లేదని చాలా సందర్భాల్లో మంత్రులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అన్న క్యాంటీన్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలోనే ప్రవేశ పెట్టిందని, వారికి కూడా ఆ పథకంపై చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను ఆపేశామని, దానివల్ల పేదలకు వచ్చిన నష్టమేదీ లేదని చెబుతున్నారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకు అన్నం అందించడం మంచిపనే అయినా.. ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు జగన్ ప్రభుత్వం కల్పిస్తోందని అంటున్నారు. అయితే టీడీపీ వాదన మాత్రం మరోలా ఉంది. పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్లను తీసేయడం దారుణం అంటూ టీడీపీ విమర్శిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా అన్న క్యాంటీన్లు ఎత్తేశారు, పేదల కడుపుకొట్టారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ నేతలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తమ సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు తెరుస్తున్నారు.