నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ అంటే గ్రూపుల మయం. తాజాగా మంత్రి పదవుల్లో మార్పుచేర్పులు చేయడంతో అవి మరింత ముదిరాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వ్యతికంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో ఓ వర్గాన్ని సిద్దం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనేది బహిరంగరహస్యం. ఆయన కాకాణితో గొడవలు ఉన్న మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ కావడం దీనికి నిదర్శనం. అందుకే కాకాణికి వ్యతిరేకవర్గంలో ఉన్న నేతలెవరు అని వైఎస్ఆర్‌సీపీలో చర్చ జరుగుతోంది. 
 
కాకాణికి వ్యతిరేకంగా నేతలను సమీకరించలేకపోయిన అనిల్ కుమార్


తాను మంత్రిగా పనిచేసిన సమయంలో జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని పదే పదే ప్రెస్ మీట్లలో వారికి ధన్యవాదాలు తెలిపారు అనిల్. అయితే ఆ లిస్ట్ లో కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. పోనీ మిగతా వారయినా అనిల్ తోపాటే ఉన్నారా అంటే అది కూడా అనుమానమే. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో అనిల్ కి మంచి సాన్నిహిత్యమే ఉంది. అయితే కాకాణి ఎంట్రీ రోజే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ ఆయన వర్గంలో చేరిపోయారు. కాకాణికి ఘన స్వాగతం పలికి ఆయనతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా కాకాణికి జై కొట్టారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎలాగూ కాకాణితో మొదటి నుంచీ సఖ్యతతోనే ఉన్నారు. 


కాకాణితో విభేదాలున్న వారు కూడా ఆయనకే మద్దతు !


ఇక కొత్తగా నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా కాకాణి అభినందన సభలో కనిపించారు. చివరిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కాకాణికి జై కొట్టారు. కాకాణితో కలసి తన నియోజకవర్గంలో సభ పెట్టి మరీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనతో సఖ్యత పెంచుకున్నారు. ఇటీవల శ్రీధర్ రెడ్డి తనకు మంత్రి పదవి రాలేదని మీడియా ముందు కన్నీరు పెట్టడం, ఆ తర్వాత పాదయాత్రలో ఉన్న శ్రీధర్ రెడ్డిని అనిల్ వెళ్లి కలవడం తెలిసిందే. అప్పటి వరకూ అనిల్, శ్రీధర్ రెడ్డి కాకాణికి వ్యతిరేకంగా జట్టు కడతారనే అనుమానాలున్నా.. చివరకు శ్రీధర్ రెడ్డి కాకాణి వర్గమేనని తేలిపోయింది. మరి అనిల్ తో ఇప్పుడు ఎవరు ఉన్నట్టు. సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాస్త అటు ఇటుగా ఉన్నా.. ఆయన త్వరలోనే కాకాణితో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి అనిల్ వర్గం ఎవరు, ఆయనతో ఎవరున్నారు..?


ఇన్నాళ్లు మంత్రిగా చేసినా ఎవరి మద్దతు పొందలేకపోయిన అనిల్ !


నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కాకాణి వైపే ఉన్నారని చెప్పక తప్పదు. కొత్తగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మంత్రి కాకాణితో ఉంటారనేది తెలిసిన విషయమే. పైగా ఇటీవలే నెల్లూరు నగరంలో వేమిరెడ్డి ఫ్లెక్సీలు చినిగిపోయిన ఘటనలో అనిల్ పైనే ఆరోపణలు వినిపించాయి. ఈ దశలో జిల్లాలోని నాయకులంతా కాకాణివైపే ఉన్నారు. కాకాణితో అనిల్ పోరు పెట్టుకున్నారు. అంటే జిల్లాలోని నాయకులందరితో అనిల్ గొడవ పెట్టుకున్నట్టే లెక్క. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా వైసీపీలో అనిల్ ఒంటరి అయినట్టే తెలుస్తోంది. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే.. జిల్లా రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. అనిల్ కి రెండు జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్ గా పార్టీ పదవి దక్కింది. అయితే వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల విషయంలో ఆయన ప్రమేయం ఉండొచ్చు కానీ, సొంత జిల్లా నెల్లూరు విషయంలో మాత్రం అనిల్ పెత్తనం ఉండకపోవచ్చు. అంటే నెల్లూరు జిల్లా వరకు అనిల్ వైసీపీలో ఒంటరి అయ్యారనే చెప్పాలి.