Anil Kumar Yadav: ఏదైనా కేసులో ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్‌లు చేయరని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఏదైనా కేసులో నమోదైతే దానిని విచారణ చేసి, దానిలో ఉన్న ప్రొసీజర్, సమయం చూసి నిందితులను అరెస్ట్ చేస్తారని అన్నారు. ఏదైనా కేసులో పద్దతి ప్రకారం విచారణ ఉంటుందని, స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం అనగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయరని, దానికంటూ ఓ పద్దతి ఉంటుందన్నారు. 


అవినీతి అనకొండ చంద్రబాబు
ఈ క్రమంలోనే స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాంలో అన్ని విషయాలను లోతుగా పరిశీలించి పిన్ టు పిన్ అన్నీ ధ్రువీకరించిన తరువాత పెద్ద అనకొండ చంద్రబాబు నాయుడు అని తేలిన తరువాతే  ఆయన్ను అరెస్ట్ చేశారని అన్నారు. ఆదివారం అని చూసి చంద్రబాబును అరెస్ట్ చేశారని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆదివారం చూస్తే నెల్లూరు రోడ్లపై ఒక్కరు కూడా లేరని అన్నారు. టీడీపీ నేతలు ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంతంగా ఉంటున్నారని, తమకు అనుకూలమైన మీడియాకు వాయిస్, వీడియో బైట్లు ఇస్తూ ఇంట్లో సైలంట్‌గా కూర్చొని ఉన్నారని అన్నారు. 


జగన్‌పై ప్రజలకు నమ్మకం ఉంది
ఎక్కడ కూడా కనీస స్పందన లేదన్నారు. అందుకనే దత్తపుత్రుడితో ఓవర్ యాక్షన్ చేయించారని విమర్శించారు. సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్‌లో చెప్పిన ఆడియో ఉందని, అందులో ప్రజలు మద్దతు తెలపడం లేదని,  నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కట్లేదని అచ్చెన్నాయుడు చెప్పారని అన్నారు. చంద్రబాబు అవినీతి చేశారని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు నమ్మారని  అందుకే స్పందన కరువైందన్నారు. జగన్ మోహన్ రెడ్డి మంచి పనిచేశారని, చంద్రబాబు అరెస్ట్‌లో ప్రొసీజర్ ఫాలో అయ్యారని ప్రజలు నమ్మారని అన్నారు. 


ఇంకో ఆరు జన్మలు ఎత్తినా టీడీపీ అధికారంలోకి రాదు
ఎవరు, ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే జగన్ మోహన్ రెడ్డి సహించరని, అందులో భాగంగానే చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు. ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు రాసేదంతా గెజిటా అని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లో నడిచే పత్రికలు, చానెల్లు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నారు. ఎల్లో మీడియాకు చంద్రబాబు తప్ప మరో వ్యక్తి సీఎం అవడం ఇష్టం లేదన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును కారణ జన్ముడిగా చూపిస్తున్నాయని మండిపడ్డారు. మరో ఆరు జన్మలు ఎత్తినా తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రాలేదన్నారు. ఆ పార్టీ సచ్చిపోయిందని, కార్యకర్తలు, నాయకులు బయటకు రావడం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారని, టీడీపీని ప్రజలు పూర్తిగా  కప్పెట్టేశారని అన్నారు.


టీడీపీకి రాజకీయ సమాధి
చంద్రబాబు నాయుడు ఈ రోజుతో టీడీపీని సమాధి చేశారని అనిల్ కుమార్ అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు గుర్తించారని, టీడీపీకి రాజకీయ సమాధి తప్పదన్నారు. చంద్రబాబు చేసిన పనికి  టీడీపీ నేతలు, కార్యకర్తలే తల ఎత్తుకోలేకపోతున్నారని అన్నారు. తప్పు చేసిన వారికి, క్రైం చేసిన వారికి, అవినీతి చేసిన వారికి సానుభూతి ఉండదన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. ఎవరికైనా అంతే అన్నారు. లోకేష్‌కు ముడుపులు అందాయని, దీనిపై లా పరంగా వెళ్లాల్సి ఉందన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు, లోకేష్ విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు.