ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పౌరుషం ఉంటే, ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, కార్పొరేటర్లు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆత్మాభిమానం ఉంది, 13 నెలల అధికారం వదులుకున్నాను, సెక్యూరిటీని త్యాగం చేశాను అంటూ కబుర్లు చెప్పే బదులు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయొచ్చు కదా అని అడిగారు. రాజీనామా చేయండి, ఆత్మాభిమానం చాటుకోండి అంటూ సవాల్ విసిరారు. దయచేసి మీడియా ముందుకొచ్చి పదే పదే ఆత్మాభిమానం అని చెప్పుకోవద్దని సూచించారు.


నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడప గడప కార్యక్రమంలో మరింత హుషారుగా పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి మధ్య పొసగడం లేదు. అయితే ఇద్దరూ గుంభనంగానే ఉంటున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి పార్టీని వదిలి బయటకు వెళ్లిపోవడంతో నెల్లూరుపై పట్టు పెంచుకోడానికి అనిల్ తన ప్రయత్నాలు ప్రారంభించారు. తమ ఇద్దరికీ పడటంలేదని, కొన్నాళ్లుగా మాటల్లేవని ఇటీవల అనిల్ స్వయంగా మీడియాకు చెప్పారు. ఆ తర్వాత ఆయన నెల్లూరు రూరల్ రాజకీయాల్లో కూడా పావులు కదుపుతున్నారు.


ఆదాల ప్రభాకర్ రెడ్డితో గతంలో అంటీ ముట్టనట్టుగానే ఉన్న అనిల్, ఇటీవల కోటంరెడ్డి వ్యవహారం బయటపడిన తర్వాత ఆయనకు మద్దతుగా బయటకొస్తున్నారు. నెల్లూరు రూరల్ కి సంబంధించి కార్పొరేటర్లను ఏకం చేసేందుకు అనిల్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో అనిల్ కోటంరెడ్డిని మరింతగా రెచ్చగొట్టేందుకే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారు.


కోటంరెడ్డి వెర్షన్ ఏంటి..


గతంలో కూడా కొంతమంది కోటంరెడ్డి రాజీనామాకు డిమాండ్ చేశారు. పార్టీని వద్దంటున్నారు కదా, పదవిని కూడా త్యాగం చేయండి అని డిమాండ్ చేశారు. దానికి అప్పుడే కోటంరెడ్డి బదులిచ్చారు. టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా గ్రామాల్లో తిరుగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. వారెవరూ ఆయా పార్టీలకు రాజీనామా చేయలేదు. రాజీనామా చేయకుండా, పార్టీ కండువా కప్పుకోకుండా తెలివిగా... వారి కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్పించి వైసీపీకి అనుబంధ సభ్యులుగా అనధికారికంగా కొనసాగుతున్నారు. మరి వారి సంగతేంటి అని ప్రశ్నించారు కోటంరెడ్డి. వారితోటి రాజీనామాలు చేయించాలని వైసీపీకి ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు.


ఎవరెన్ని రెచ్చగొట్టినా కోటంరెడ్డి రాజీనామా చేసేందుకు ఉత్సాహం చూపించరనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అందులోనూ కార్పొరేటర్లకు ఇంకా చాలా పదవీ కాలం ఉంది. వారిపై రాజీనామా ఒత్తిడి తెస్తే, వారు ఆదాల వర్గంలోకి వచ్చేస్తారనే అంచనాలో ఉంది వైసీపీ అధిష్టానం. అందుకే రాజీనామాలు చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్పొరేటర్లు కూడా రాజీనామాలకు సిద్ధంగా లేరు. ప్రస్తుతం కోటంరెడ్డి ఎన్నికలను ఎదుర్కొనే ఉద్దేశం లేదు. వీలైనంత వరకు వైసీపీకి నష్టం చేసి, ఆ తర్వాత ఆయన కొత్త పార్టీ కండువా కప్పుకునేలా ఉన్నారు. ఈలోగా నెల్లూరు రూరల్ సమస్యలపై ఆయన పోరాటం చేసే అవకాశం ఉంది. కలెక్టరేట్ ముట్టడి, కార్యాలయాల ముందు ధర్నా అంటూ ఆయన కార్యాచరణ ప్రకటించారు కూడా.