నెల్లూరు రాజకీయాల్లో ఇదో కీలక మలుపు. ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ పక్కన పెట్టడంతో ఆయనతోపాటు కుటుంబం మొత్తం వైసీపీని వీడే అవకాశాలున్నాయని అనుకున్నారు. కానీ సడన్ గా ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి అందరికీ షాకిచ్చారు. ఆయన నేరుగా సీఎం జగన్ ని వెళ్లి కలిశారు. తన భార్య, నెల్లూరు జడ్పీ చైర్మన్ అరుణమ్మ, కుమారుడు కార్తికేయరెడ్డితో కలసి వెళ్లి జగన్ ని కలిశారు. తామంతా సీఎం జగన్ వెంటే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. అంటే ఒకవేళ రామనారాయణ రెడ్డి పార్టీ మారినా, తాము మాత్రం వైసీపీలోనే ఉంటామని వారు జగన్ కి నమ్మకంగా చెప్పారు.


ఆనం కలయికలో ఆంతర్యమేంటి..?


ఇప్పటికిప్పుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెళ్లి సీఎం జగన్ ని కలవాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీలోనే ఉన్నారు. రామనారాయణ రెడ్డి కూడా పార్టీలోనే ఉన్నా, ఆయన స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జి గా నియమించారు. దీంతో ఆనం కుటుంబం వైసీపీని వీడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆనం కుటుంబం అంతా టీడీపీలో చేరుతుందని, ఆయన నెల్లూరు సిటీ లేదా రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని, రామనారాయణ రెడ్డి కుమార్తె ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి విజయ్ కుమార్ రెడ్డి జగన్ ని వెళ్లి కలిశారు. వైసీపీ హయాంలోనే తమకు పదవులు వచ్చాయని, తాము వైసీపీలోనే ఉంటామని చెప్పారు. జగన్ తోనే తమ ప్రయాణం అని అన్నారు.


ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలుకుబడి ఉంది. అక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇటీవలే శ్రీధర్ రెడ్డిని కూడా సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. గడప గడప కార్యక్రమాన్ని మరింత జోరుగా సాగించాలని చెప్పారు జగన్. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి కూడా మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా మాట్లాడారు. పెన్షన్ల కోత విషయంలో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇక నెల్లూరు రూరల్ పరిధిలో విజయ్ కుమార్ రెడ్డికి, శ్రీధర్ రెడ్డికి చాన్నాళ్లుగా మాటలు లేవు. ఎవరి రాజకీయం వారిదే, ఎవరి గ్రూపులు వారివే. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తరపున నెల్లూరు సిటీ లేదా రూరల్ లో పోటీకి వస్తే ఆయన సోదరుడు వైసీపీలో ఉండటం ఆ పార్టీకి బలం చేకూరుస్తుంది. అందుకే ఆనం కుటుంబంలో విజయ్ కుమార్ రెడ్డిని జగన్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు.


అంతుచిక్కని నెల్లూరు రాజకీయం..


నెల్లూరులో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా కూడా ఒకరంటే ఒకరికి పడటంలేదు. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో టికెట్లకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ పోస్ట్ ల కంటే.. నెల్లూరులో గ్యారెంటీ గెలుపు అనుకునే నియోజకవర్గాలనుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఆనం విజయ్ కుమార్ రెడ్డ కూడా ఒకరు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ దూరం పెట్టినా, ఆయన మాత్రం అన్నయ్యతోపాటు ఉండకుండా, జగన్ కే జై కొట్టారు. అలా ఆయన స్పెషల్ అని నిరూపించుకున్నారు. మరి విజయ్ కుమార్ రెడ్డికి జగన్ ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.