వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి దూరం జరిగినా జగన్ పై ఎప్పుడూ ఇంత ఘాటుగా మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత జగన్ ని సైకో అంటూ విరుచుకుపడ్డారు రామనారాయణ రెడ్డి. సైకో దిగిపోయే వరకు పోరాటం చేస్తానన్నారు. ఆయన తండ్రిలాగా పాలన ఉంటుందని అనుకున్నామని, కానీ ఆరు నెలల్లోనే జగన్ బండారం బయటపడిపోయిందని చెప్పారు. ఇంకా ఆయనకు ఆరు నెలలు మాత్రమే అధికారం మిగిలి ఉందని గుర్తు చేశారు. చంద్రబాబుని జైలులో పెట్టి పైశాచికానందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు ఆనం.
నారా భుననేశ్వరి, బ్రాహ్మణి కార్యకర్తలకు అండగా నిలబడతారని, చంద్రబాబు ప్రజలకు దగ్గరగా లేకపోయినా ఆ లోటు వారు తీరుస్తారని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. చంద్రబాబు భరోసా పేరుతో త్వరలో ప్రచారం మళ్లీ మొదలవుతుందన్నారు. నారా లోకేష్ యువగళం కూడా తిరిగి మొదలవుతుందని, కార్యాచరణ రూపొందుతోందని చెప్పారు. ఏపీలో సైకో జగన్ పాలన పోయే వరకు పోరాటం చేస్తామన్నారు. రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేనని చెప్పారాయన. ప్రజలకు నిజం తెలిసేందుకే తాము దీక్షలు చేపట్టామన్నారు. జగన్ పైశాచికానందం కోసమే చంద్రబాబుని జైలులో పెట్టారన్నారు ఆనం.
సజ్జల, విజయసాయికి అంత సీన్ లేదు..
ప్రస్తుతం సీఎం జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు ఆనం. ప్రస్తుతం జగన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కువగా నమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించిన అన్ని వివరాలు అప్ టు డేట్ జగన్ కి చేర్చింది చెవిరెడ్డేనని అన్నారు ఆనం. ప్రస్తుతం సజ్జలను, విజయసాయిని జగన్ పెద్దగా నమ్మడం లేదని, కానీ వారు మాత్రం ఆయనతోనే ఉంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని చెప్పారు. జగన్ స్పెషల్ ఫ్లైట్ లో చెవిరెడ్డి కూడా ఉన్నారని, మధ్యలో ఏదో ఒక ఎయిర్ పోర్ట్ లో ఆ విమానం ఎక్కి, జగన్ కి సమాచారం అంతా చేరవేశారన్నారు. జగన్ పైశాచికానందంతో ఫ్లైట్ దిగారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆనం.
రాజకీయ సమిధలైనా పర్లేదు..
చంద్రబాబుకోసం తాము రాజకీయ సమిధలు అవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు కార్పొరేషన్ కింద ఉన్నాయని, ఆ కార్పొరేషన్ పక్కాగా తెరపైకి తెచ్చారని, అందులో కుంభకోణం అనేది అసత్యం అని అన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఓ పథకం ప్రకారమే చంద్రబాబుని కేసుల్లో ఇరికించారని, ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. జైలులో ఆయనకు ప్రాణ హాని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాల వల్ల వివిధ కారణాలతో జైలుకి వెళ్లినవారు ఆయనకు హాని తలపెట్టే అవకాశముందన్నారు ఆనం. ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. చంద్రబాబుకి మద్దతుగా ఆత్మకూరులో రిలే నిరాహార దీక్షలను ఆయన మొదలు పెట్టారు. అన్ని మండలాల్లో దీక్షలు చేపడతామని చెప్పారు.