వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి ఒంగోలులోని మహానాడులో తళుక్కున మెరిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి తన భర్త రితేష్ రెడ్డితో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు కైవల్యా రెడ్డి. త్వరలో ఆమె టీడీపీలో అధికారికంగా చేరబోతున్నారని సమాచారం. స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె టీడీపీ నాయకులను కలవడంతో నెల్లూరు జిల్లా వైసీపీలో కలకలం రేగింది. 


కైవల్యా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె మాత్రమే కాదు, బద్వేలు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మకి స్వయానా కోడలు. విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డికి కైవల్యా రెడ్డి భార్య. అత్తగారింటి తరపున కూడా ఆమెకి రాజకీయ నేపథ్యం ఉంది. అయితే కైవల్యా రెడ్డి ఎప్పుడూ నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. 


కైవల్యా రెడ్డి భర్త రితేష్ రెడ్డి బద్వేల్ రాజకీయాల్లో టీడీపీ తరపున చురుకైన లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తరచూ ఆయన పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా బద్వేలులో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ దశలో ఆయన కైవల్యా రెడ్డితో కలసి నారా లోకేష్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


ఆత్మకూరు బరిలో దిగుతారా..?
కైవల్యా రెడ్డి తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన మంత్రిగా ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆనంకు ఆత్మకూరులో మంచి ఇమేజ్ ఉంది. మరోవైపు బద్వేల్ కూడా ఆత్మకూరుకి పొరుగు నియోజకవర్గమే. బద్వేల్ నియోజకవర్గంలోకి వచ్చే పల్లెల్లో కైవల్యా రెడ్డి అత్తగారి కుటుంబానికి మంచి పేరుంది. అలా ఆమె ఆత్మకూరు నియోజకవర్గంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఆత్మకూరులో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దివంగత నేత కుటుంబానికి టికెట్ ఇచ్చారు కాబట్టి... టీడీపీ ఈ పోరులో తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. ఒకవేళ కైవల్యా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం ఆమో 2024 ఎన్నికల్లో ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థిగా నిలబడే అవకాశముంది. 


ఆనం రామనారాయణ రెడ్డి సంగతేంటి..?
గతంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్వపక్షంలో విపక్షంలా ఉన్నారు. అయితే కాకాణికి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆనం, పూర్తిగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వెంకటగిరి పరిధిలో వైసీపీ తరపున విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారానికి చెక్ పెట్టేశారు. మరిప్పుడు ఆయన కుమార్తె, నారా లోకేష్ ని కలవడం మాత్రం కాస్త కలకలం సృష్టిస్తోంది. 


ఆనం కుటుంబంలో ఎవరెటు..?
ఆనం సోదరులు నలుగురు. దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అందులో ఒకరు. ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం విజయ కుమార్ రెడ్డి కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆనం జయకుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆనం కుటుంబం నుంచి ఆనం వెంకట రమణారెడ్డి ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు కైవల్యా రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనం కుటుంబంతోపాటు, జిల్లా రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది.