ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివార్లలో గురువారం అర్థరాత్రి జరిగిన హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ రోడ్డు పక్కన శవమై పడి ఉంది. ఆమెను తీవ్రంగా హింసించి చంపినట్టు తేలింది. ఆమెపై నుంచి కారుని పోనిచ్చి, ఆపై బండరాయితో మోది హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చూపించలేదు. రాధకు చిన్ననాటి నుంచి స్నేహితుడైన కేతిరెడ్డి కాశిరెడ్డి అలియాస్ చినకాశయ్యపై అనుమానం ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఎవరీ కాశిరెడ్డి, రాధను ఎందుకు చంపించారు..?
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు రాధ స్వగ్రామం, ఆ పక్కనే ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తి కాశిరెడ్డి. చిన్నప్పటి నుంచి ఒకేచోట చదువుకోవడం, కాలేజీలో కూడా క్లాస్ మేట్స్ కావడంతో రాధ, కాశిరెడ్డి మధ్య స్నేహం ఉంది. రాధ పెళ్లి తర్వాత ఆమె తెలంగాణలోని కోదాడకు వెళ్లిపోయారు. అయినా కూడా కాశిరెడ్డితో స్నేహంగానే ఉండేవారు. రాధ భర్త మోహన్ రెడ్డికి కూడా కాశిరెడ్డి తెలుసు. ఫ్యామిలీ ఫ్రెండ్ గా వారితో కలసిపోయేవాడు.


Also Read: సీబీఐ విచారణకు ఇవాళ కూడా హాజరుకాని అవినాష్ రెడ్డి


కాశిరెడ్డి. మోహన్ రెడ్డి, కాశిరెడ్డి ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పని చేస్తుండేవారు. ఆ మధ్య కాశిరెడ్డి ఉద్యోగం పోవడంతో మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆర్థిక సాయం కోరాడు. స్టార్టప్ కంపెనీ పెడుతున్నానని చెప్పి పెట్టుబడి అడిగాడు. చిన్నప్పటి నుంచి తెలిసివాడే కావడంతో రాధ కుటుంబం ఆర్థిక సాయం చేసింది. 80లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ బాకీ వసూలు విషయంలో మనస్పర్థలు రావడం చివరికి రాధ హత్యకు దారి తీసిందనే అనుమానాలున్నాయి. 


ఈ నెల 11న గ్రామంలో నిర్వహించే చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇద్దరు పిల్లలతో కలసి రాధ జిల్లెళ్లపాడుకి వచ్చారు. ఆ సమయంలోనే కాశిరెడ్డి ఫోన్ చేసి బాకీలో కొంత చెల్లిస్తానని నమ్మకంగా చెప్పాడు. ఆమెను పామూరు రమ్మన్నాడు. ఆ మాటలు నమ్మి రాధ పామూరు వెళ్లిందని, ఆ తర్వాత శవమై తేలిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారమిచ్చినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 




ఒంటరిగా ఎందుకెళ్లారు..?
బాకీ తిరిగిస్తానని కాశిరెడ్డి చెప్పినా.. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని రాధ అంత గుడ్డిగా ఎందుకు నమ్మారనేదే తేలాల్సిన విషయం. రాత్రి వేళ ఎవరూ తోడు లేకుండా ఆమె పామూరు బస్టాండ్ కి ఎందుకెళ్లారనేది తేలాల్సి ఉంది. కాశిరెడ్డికి రాధను హత్య చేయాల్సినంత పగ ఎందుకుందనేది కూడా తెలియడం లేదు. బాకీ చెల్లించకపోగా, రాధను హత్య చేస్తే అది మరింత పెద్ద నేరమవుతుందని కాశిరెడ్డి ఎందుకు ఊహించలేకపోయాడు. చిన్ననాటి స్నేహితురాలిని దారుణంగా ఎందుకు హత్య చేశాడు. శవాన్ని రోడ్డుపక్కన వదిలేసి ఎందుకు పారిపోయాడనే విషయంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అసలు ఆ హత్య చేసింది, లేదా చేయించింది కాశిరెడ్డేనా.. లేక ఇంకెవరైనా ఆమెను హత్య చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 


ప్రకాశం జిల్లాలో జరిగిన వివాహిత దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాకీ వసూలు విషయంలో గొడవ జరగిందనేది ప్రాథమికంగా తెలుస్తున్నా, అసలు కారణమేంటో కనిపెట్టడానికి పోలీసులు ఆధారాలకోసం ప్రయత్నిస్తున్నారు. రాధ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినవారి గురించి ఆరా తీస్తున్నారు. 


Also Read: కుప్పంలో రెండు మదపుటేనుగులను బంధించిన అటవీ శాఖ అధికారులు