ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్న బస్ కెనాల్‌లో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొన్ని కుటుంబాలు కాకినాడ బయల్దేరాయి. పెళ్లి రిసెప్షన్ కోసం బస్‌ను బుక్ చేసుకొని వెళ్లాయి. వారు వెళ్తున్న బస్సు దర్శి సమీపంలోకి వచ్చేసరికి ప్రమాదానికి గురైంది. బస్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా సాగర్ కాల్వలోకి బస్ దూసుకెళ్లింది.
ఈ దుర్ఘటనలో ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం బస్‌లో 45 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. మరణించిన వారంతా పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హానీ, షేక్ రమీజ్, ముల్లాజానీబేగం, షేక్ షబీనా, ముల్లానూర్జహాన్, షేక్ హీనా ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా ఓ ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి బస్ డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.