Nellore News :ఇటీవల కాలంలో మహిళలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. మారు పేర్లతో మహిళలను వేధిస్తున్నారు ఆకతాయిలు. ఇన్ స్టా గ్రామ్ ఓ యువతిని వేధించాడో పోకిరి. అతడి అడ్రస్ కనిపెట్టిన యువతి చెప్పుతో బుద్ధి చెప్పింది. నెల్లూరు జిల్లా కావలిలో నడిరోడ్డుపై ఓ యువకుడిని యువతి చెప్పుతో కొట్టింది. పక్కన వాళ్లు వారించినా వినకుండా చావగొట్టింది. కావలి పట్టణంలోని ఏఎం బేకరీ సెంటర్లో టీ దుకాణంలో కల్యాణ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో అసభ్య మెసేజ్ లు పంపించారని బాధిత మహిళ ఆరోపించింది. కల్యాణ్ అడ్రస్ కనుక్కుని  అక్కడికి చేరుకుని యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియా ఎంట్రీతో ఈ ఘటనలు పెరిగిపోయాయని బాధితులు అంటున్నారు. మారు పేర్లు, నకిలీ ఫొటోలతో అకౌంట్లు క్రియేట్ చేసి మహిళలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనల్లో యువతులు కూడా భాగస్వాములు అవుతున్నారు. కొందరు యువతులు వీడియో కాల్స్ రూపంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. 



ప్రేమించలేదని యువతి ముక్కు కొరికేసిన లాయర్


ప్రేమ.. ఆ పదం వింటే కొందరు చాలా సంతోషంగా ఫీలవుతుంటారు. మరికొందరేమో భయపడిపోతుంటారు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కొందరు ప్రేమకు నో చెబితే దాడులు చేయడం, చంపేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అందుకే చాలా మంది ఈ పదం వింటేనే గజగజా వణికిపోతున్నారు. చిన్న పిల్లలు, తెలియని వాళ్లు, చదువూ, సంధ్యాలేని వాళ్లు, కళాశాల విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడడం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చూడబోయేది మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటారా.. లాయర్ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా లాయర్ ను ప్రేమించాడు. ఆమె ప్రేమకు అంగీకరించకపోవడంతో ఆమె ముక్కును కొరికేశాడు. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కు చెందిన ఓ మహిళా లాయర్... 2018లో లాయర్ చంద్రశేఖర్ వద్ద ఇంటర్న్ షిప్ చేసింది. అయితే సదరు మహిళా న్యాయమూర్తిపై మనసు పడ్డ లాయర్ చంద్రశేఖర్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు బాధితురాలు నో చెప్పింది. అయినప్పటికీ అతను పట్టించుకోకుండా పోకిరిలా ఆమె వెంటపడ్డాడు. ఇదిలా ఉండగా... సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాధితురాలు, లాయర్ చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం ఆమె కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా.. చంద్రశేఖ్ ఆమె స్కూటీని అడ్డుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె మళ్లీ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్.. ఆమె ముక్కును కొరికి, దాడి చేశాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గాయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.