Nellore Rottela Festival : నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పండుగలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నెల్లూరులోని బారా షహీద్ దర్గాను సందర్శించి అక్కడి స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు మార్చుకున్నారు. రెండేళ్ల కోవిడ్ విరామం తర్వాత ఈ ఏడాది పండుగ ఘనంగా నిర్వహించారు. అంచనాలకు మించి భక్తులు వస్తారని ఆశించినా నాలుగో రోజు నుంచి జనం తాకిడి కాస్త తగ్గింది. అయితే ఐదో రోజు కూడా భక్తులు వచ్చి ఇక్కడ రొట్టెలు మార్చుకున్నారు. 


గంధం కోసం 


రొట్టెల పండగలో ముఖ్యఘట్టమైన గంధమహోత్సవం మూడోరోజు ఘనంగా జరిగింది. కడప దర్గా పీఠాధిపతి గంధాన్ని తీసుకొచ్చి స్వర్ణాల చెరువు నీటిలో కలిపి సమాధులపై లేపనం చేశారు. అనంతరం ఆ గంధాన్ని చెరువులో కలిపారు. ఈ గంధం తీసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దర్గాకు వచ్చారు. గురువారం రాత్రి గంధ మహోత్సవం అనంతరం శుక్ర, శనివారాల్లో రొట్టెలు పట్టుకునేందుకు ఉత్సాహం చూపించారు భక్తులు. తమ కోర్కెలు నెరవేరాయని, నమ్మకంగా కోరుకుంటే ఎలాంటి కోర్కెలైనా తీరుతాయని భక్తుల నమ్మకం.


భారీ బందోబస్తు


ఈనెల 9న మంగళవారం సొందల్ మాలి కార్యక్రమంతో రొట్టెల పండగ మొదలైంది. 10వ తేదీ బుధవారం గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. 11వతేదీన అధికారికంగా రొట్టెల పండగ ప్రారంభించారు. 12వ తేదీ శుక్రవారం తహలీల్ ఫాతెహా నిర్వహించారు. 13న ముగింపు ఉత్సవంతో నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ ఘనంగా ముగిసింది. రొట్టెల పండగ సందర్భంగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. రెడ్ క్రాస్ సభ్యులు వృద్ధులు, మహిళలకు సాయం చేశారు. మొత్తమ్మీద ఈ ఏడాది బారా షహీద్ దర్గా రొట్టెల పండగ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తయింది. 


పర్యాటకుల సందడి


స్థానికంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఈ రొట్టెల పండుగకు తరలివచ్చారు. ఇరుగు పొరుగు జిల్లాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో రొట్టెల పండగకు వచ్చారు. బారా షహీద్ దర్గాతోపాటు యాత్రికులు జిల్లాలోని ప్రముఖ దర్గాలైన కసుమూరు దర్గా, ఏఎస్ పేట దర్గాలను సందర్శించుకున్నారు. ప్రతి ఏడాదీ రొట్టెల పండుగ జరిగే నెలలో నెల్లూరు జిల్లా అంతా పర్యాటకులతో సందడిగా ఉంటుంది. 


తిరుగు ప్రయాణాలు


బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగ తొలి నాలుగు రోజులు స్థానిక భక్తులు పెద్దగా హాజరు కాలేదు. రద్దీ తగ్గిన తర్వాత వారంతా ఐదోరోజు దర్గాకు వస్తున్నారు. స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలను మార్చుకుని అమరవీరుల సమాధులను దర్శించుకున్నారు భక్తులు. పెద్ద సంఖ్యలో బారాషహీద్‌ దర్గాకు వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలివచ్చిన భక్తులు ఇప్పుడు తిరుగు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. తిరుగు ప్రయాణంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలకసంస్థ అధికారులు సూచిస్తున్నారు. వాహనాలను అతివేగంతో నడపొద్దని సూచిస్తున్నారు. డ్రైవర్లు తగిన విశ్రాంతి తీసుకొని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  మొత్తమ్మీద ఈ ఏడాది రొట్టెల పండగ ప్రశాంతంగా ముగిసింది. 


Also Read : Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !