ఇటీవల నెల్లూరులో నక్షత్ర స్కూల్ లో జరిగిన వ్యవహారంపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నక్షత్ర స్కూల్ లో ఓ బాలిక పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడింది. అయితే ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని స్కూల్ కరస్పాండెంట్, వ్యాన్ డ్రైవర్ ఆమెను మానసికంగా వేధిస్తున్నారని, ఆ చిట్టీల వ్యవహారం బయటపెడతామంటూ భయపెట్టి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బాలిక తల్లి ఇటీవల స్కూల్ ముందు ధర్నా చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా పోలీసులు నక్షత్ర స్కూల్ యాజమాన్యంపై కేసు పెట్టింది. స్కూల్ కరస్పాండెంట్ జీవనకృష్ణ సహా, వ్యాన్ డ్రైవర్ మహేష్ పై పోక్సో కేసు పెట్టారు పోలీసులు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి కాకాణి ఫోకస్..
ఈ ఘటన జరిగిన తర్వాత పలు రకాల భిన్నమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్ యాజమాన్యం తమ తప్పేమీ లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ధీమాగా చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీ చూస్తే మీకే అర్థమవుతుందని ఇద్దరు కరస్పాండెంట్లు చెప్పారు. కానీ బాలిక తల్లి ఆవేదనతో నాయకులు కూడా కదలివచ్చారు. మంత్రి కాకాణి ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టిసారించాలని జిల్లా విద్యా అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా దీనిపై దృష్టి పెట్టారు. చివరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది..?
స్కూల్ తో తన పాప కాపీ కొట్టిందనే నెపంతో కరస్పాండెంట్, వ్యాన్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని, తన కుమార్తెకు న్యాయం చేయాలని శుక్రవారం ఓ తల్లి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. కరస్పాండెంట్ కారు కదలనీయకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. తన కూతురితో స్కూల్ లో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇక స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ తల్లి వాదనను తిప్పికొట్టింమది. విద్యార్థిని పరీక్షల్లో స్లిప్పులు పెట్టిందని, ఆ విషయం తల్లికి కూడా తెలుసని, కావాలనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తోందని స్కూల్ కరస్పాండెంట్ చెబుతున్నారు. విద్యార్థినికి క్రమశిక్షణ నేర్పడమే తప్పా అని కరస్పాండెంట్ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే నెల్లూరులో ఒవెల్ స్కూల్ లో ఇలాంటి ఘటన జరిగింది. నాలుగో తరగతి చదివే చిన్నారిపై స్కూల్ పీఆర్వో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ ఘటనలో యాజమాన్యం కూడా తప్పు ఒప్పుకుంది. సదరు పీఆర్వో కూడా తప్పు ఒప్పుకోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టంకింద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత స్కూల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. స్కూల్ ని మూసివేసేలా డీఈవో ఆదేశాలిచ్చారు. కానీ స్కూల్ మూసివేస్తే ఇతర విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయనే మానవతా దృక్పథంతో తర్వాత స్కూల్ తిరిగి ప్రారంభించుకునేలా ఆదేశాలిచ్చారు అధికారులు.
తాజాగా నక్షత్ర స్కూల్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని తెలిసే సరికి నెల్లూరులో పేరెంట్స్ ఆందోళన పడ్డారు. స్కూల్ కి ఆడపిల్లల్ని పంపించే తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు నక్షత్ర స్కూల్ ఘటనలో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.