నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్ ని బలిచేయొద్దని వారు యాజమాన్యాన్ని వేడుకున్నారు. తమ పిల్లలు ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ లెక్చరర్లతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నా అవి ఓ కొలిక్కి రాలేదు. దీంతో తల్లిదండ్రులు నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు.


అసలేం జరిగిందంటే..?


నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు, ప్రైవేటు రంగంలో నారాయణ మెడికల్ కాలేజీ ఉంది. నారాయణ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం గొడవ జరుగుతోంది. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కావాలనే ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఫెయిల్ చేయించారనేది ప్రధాన ఆరోపణ. థియరీ పరీక్షల్లో 80శాతం కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన విద్యార్థులు ప్రాక్టికల్స్ లో మాత్రం ఎలా ఫెయిలయ్యారంటూ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఇంటర్నల్ మార్కులు లెక్చరర్ల చేతుల్లోనే ఉంటాయి కదా మరి విద్యార్థులను ఎలా ఫెయిల్ చేశారని అడిగారు తల్లిదండ్రులు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


మళ్లీ ప్రాక్టికల్స్ పెట్టాలి..


విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. ప్రాక్టికల్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు.  ఫెయిల్ అయిన విద్యార్థులు తమ వద్దకు ట్యూషన్ కు వస్తారనే దురుద్దేశంతోనే ఉపాధ్యాయులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. మెడికల్ కాలేజీల విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, తొలిసారిగా ఇలా అందర్నీ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేయించారని అంటున్నారు. మొత్తం 125మంది విద్యార్థులను ఫెయిల్ చేయించారని చెబుతున్నారు.


కాలేజీ యాజమాన్యం వివరణ..


కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తమ కాలేజీలో జరిగిన ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగలేదని అన్నారు నారాయణ కాలేజీ డీన్. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ లెక్చరర్లు ఫెయిల్ చేయరని చెప్పారు. అయితే తల్లిదండ్రుల విన్నపం ప్రకారం వారి అభ్యర్థనను వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీకి పంపించామని చెప్పారు.


తల్లిదండ్రులు తమ పిల్లలకు రీఎగ్జామ్ పెట్టి పాస్ చేయించాలని కోరారని, వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీకి వారి అభ్యర్థన పంపిచామని నారాయణ మెడికల్ కాలేజీ డీన్ తెలిపారు. అక్కడినుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తాము పరీక్షలు నిర్వహించేది లేనిది తెలుపుతామని చెప్పారు.


గతంలో ఇలాగే ఓసారి పరీక్షల వ్యవహారంలో ప్రభుత్వం తమకు సానుకూలంగా నిర్ణయం తీసుకుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈసారి కూడా ప్రభుత్వం, వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ అధికారులు తమ బాధ అర్థం చేసుకోవాలంటున్నారు. కేవలం ప్రాక్టికల్స్ లో తమను ఫెయిల్ చేసి, తమ కెరీర్ పై దెబ్బ కొట్టొద్దని అంటున్నారు.


వర్శిటీ కోర్టులో బంతి..


నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థుల వ్యవహారం ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ కోర్టులో ఉంది. హెల్త్ వర్శిటీ అధికారులు తీసుకునే నిర్ణయంపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని, యూనివర్శిటీ ఎలాంటి ఆదేశాలిస్తే, దాము వాటిని ఫాలో అవుతామని చెబుతోంది.