విక్టర్ ప్రసాద్ వ్యవహారం రోజు రోజుకీ ప్రభుత్వానికి తలనొప్పిలా మారేలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు విక్టర్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడిపై అనుచిత వాఖ్యలు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆర్యవైశ్య ప్రముఖులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు మిన్నంటాయి.
కావలి ట్రంకు రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మనస్సును నొప్పించే విధంగా విక్టర్ ప్రసాద్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేయటం బాధాకరమని అన్నారు. వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలన్నారు. ఉన్నత మైన పదవిలో ఉన్న ఆయన గాంధీపై చేసిన వాఖ్యలకు భారతదేశం బాధపడుతోందన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆర్యవైశ్య సంఘంతోపాటు గాంధేయవాదులతో కలిసి ఉద్యమం చేపడతామని చెప్పారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మహాత్మా గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నిరసనలు చేపట్టింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణం లో నల్ల బ్యాడ్జిలతో ర్యాలీ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. విక్టర్ ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనన్నారు. ఆయన్ను వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ ఆందోళనలు..
గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విక్టర్ ప్రసాద్ ను వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. విక్టర్ లాంటి దేశద్రోహులకు జగన్ పాలుపోసి పెంచుతున్నారని ఇప్పుడు గాంధీని కించపరిచిన వ్యక్తులు రేపు అంబేద్కర్ నూ కించపరుస్తారని జవహర్ విమర్శించారు. గాంధీజీని కొన్ని కులాలకు పరిమితం చేసే కుట్రగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. విక్టర్ ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీని నీచుడు, దుర్మార్గుడు అంటూ విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైశ్యులు స్పందించాలన్నారు.
విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదంగా మారే అవకాశం ఉండటంతో మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలతో వైసీపీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. విక్టర్ ప్రసాద్ ఎప్పుడూ తమ పార్టీలో లేరని చెప్పారు. ఎస్సీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విక్టర్ ప్రసాద్‌పై ఇతర కులాల హక్కులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. గాంధీజీపై విక్టర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు...