మెగా ఫ్యాన్స్ వేరు, జనసైనికులు వేరు అనేది లేదని.. ఇకపై అందరూ ఒక్కతాటిపై ఉండాలని, పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలసి నడవాలని పిలుపునిచ్చారు అభిమానులు. నెల్లూరులో మెగా గర్జన సభ పేరుతో సభ నిర్వహించారు. ఈ మెగా గర్జన సభకు మెగాస్టార్ అభిమానులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఇకపై మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఒక్కటేనని, వారంతా పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతు తెలుపుతారని అన్నారు నాయకులు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీ వల్ల అభిమానులంతా కలవలేకపోయారని, ఈసారి ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా అభిమానులు పవన్ కల్యాణ్ కోసం ఒక్కటిగా నిలబడతారని చెప్పారు.
గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మెగా అభిమానులంతా ఆయనకు అండగా నిలబడ్డారు. అధికారం చేజిక్కించుకోలేదు కానీ ప్రజారాజ్యం పార్టీ తన ఉనికి చాటుకుంది. కానీ పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు మాత్రం అభిమానులనుంచి ఆస్థాయిలో మద్దతు రాలేదు. దాని ఫలితమే గత ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకి పరిమితం కావడం. స్వయానా పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఆయన గెలవలేకపోయారు, అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుంది..? వైసీపీపై ప్రజా వ్యతిరేక ఉందని అంటున్నారు జనసేన నాయకులు. మరి ఆ వ్యతిరేకత నిజమైతే ప్రతిపక్షాలు గెలవాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా ఆయన్ను గెలిపించుకుంటామని చెబుతున్నారు జనసైనికులు. తిరుపతిలో ఆయన పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల ప్రజలు కూడా ఈసారి పోటీ చేస్తే విజయం ఖాయమని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ ప్యాన్స్, జనసైనికులు వేర్వేరు కాదు. పవన్ అభిమానులంతా జనసైనికులుగా మారిపోయారు. కొంత పర్సంటేజ్ మాత్రం సినిమాల వరకే మాకు పవన్ కల్యాణ్, రాజకీయాల్లో మా నిర్ణయం మాదేనంటున్నారు. మరోవైపు మెగా స్టార్ అభిమానులు పూర్తిగా పవన్ వైపు టర్న్ కాలేదు. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అభిమానులుంటే అది ఎవరికీ ఉపయోగం కాదని, అభిమానులంతా జనసేనకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు జనసైనికులు.
మెగాస్టార్ అభిమానులైనా, పవర్ స్టార్ అభిమానులైనా, రామ్ చరణ్ అభిమానులైనా అందరూ ఒకతాటిపైకి రావాలని ఈసారి కచ్చితంగా పవన్ కి సపోర్ట్ ఇవ్వాలంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో మెగా గర్జన సభ జరిగింది. మెగాస్టార్ అభిమానుల్ని ఈ కార్యక్రమానికి పిలిచి సత్కరించారు జనసేన నేతలు. వారి మద్దతు కావాలని కోరారు. ఇకపై జనసేన కార్యక్రమాల్లో మెగా అభిమానులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ ని గెలిపించుకోవాలని అందరూ కలసి ప్రతిజ్ఞ చేశారు. మెగా అభిమానులంతా పవన్ వైపు వస్తే లెక్కలేవైనా మారతాయా..? కేవలం సినిమా అభిమానులతో పవన్ కల్యాణ్ అద్భుతాలు సృష్టించగలరా..? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధాం చెప్పలేం కానీ.. మెగా అభిమానుల అండదండలు పవన్ కి కచ్చితంగా ఉపయోగపడతాయని అంటున్నారు.