Nellore News : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లా నెల్లూరులో ఏకంగా 25మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లు సస్పెండ్ అయ్యారు. మొత్తం 63 మందిపై ఆరోపణలు రాగా అందరికీ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులిచ్చారు. తాజాగా 25 మందిని సస్పెండ్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.
అసలేం జరిగింది..?
ఏపీ ప్రభుత్వం సదుద్దేశంతో రైతుల కోసం తీసుకొచ్చిన ధాన్యం సేకరణ పథకం కొంతమంది వీఏఏల వల్ల అభాసుపాలవుతోంది. సొంత పొలం కలిగిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలుంటాయి. కౌలు రైతులకు కౌలు రైతుల కార్డులుంటాయి. వీరంతా ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే, దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా ధాన్యం ప్రభుత్వానికి అమ్ముకోడానికి అవకాశముంటుంది. ప్రైవేటు దళారీలు రేటు తెగ్గోయడం, తరుగు తీసేయడం అంటూ ఇబ్బంది పెడుతుంటారు. కానీ ప్రభుత్వానికి అమ్మితే పుట్టి(850కేజీలు)కి 3500 రూపాయలు తేడా వస్తుంది. అందుకే దళారులు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఈ అమ్మకాలలో వీఏఏలు కీలకం. వారు ఈక్రాప్ నమోదు చేస్తేనే దళారులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మగలరు. అక్కడ డబ్బులు చేతులు మారాయి. వాస్తవానికి రైతుల దగ్గర ధాన్యం సేకరించాల్సిన ప్రభుత్వం, దళారుల దగ్గర సేకరించాల్సి వచ్చింది. రైతుల దగ్గర ముందుగానే ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీనికోసం పొలాలే కాదు, కాల్వలు, వాగులు, ఇతర బంజరూ భూముల్ని కూడా వరి పండించే పొలాలుగా తప్పుగా ఈక్రాప్ చేశారు వీఏఏలు. అక్కడ వీరు ప్రభుత్వానికి దొరికిపోయారు.
కావలిలో బయటపడింది
సహజంగా రబీ, ఖరీఫ్ సీజన్లో తమ ప్రాంతంలో ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుందో అధికారులకు తెలుసు. కానీ ఇటీవల ధాన్యం సేకరణ మొదలు పెట్టిన తర్వాత కావలి ఏరియాలో రెట్టింపు ధాన్యం పండినట్టు లెక్కలు తేలాయి. రెట్టింపు పొలం వినియోగంలోకి వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో గణాంకాల శాఖ అధికారులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాల్సిన సందర్భంలో దళారుల దగ్గర పెద్ద మొత్తంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా పథకం పక్కదారి పట్టింది. దీనికి మూల కారకులు వీఏఏలు అని తేలింది. కావలి, ఆత్మకూరు డివిజన్ల పరిధిలో మొత్తం 63మందికి షోకాజ్ నోటీసులిచ్చారు ఉన్నతాధికారులు. తప్పు జరిగిందని పక్కాగా తేలిన తర్వాత 25 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లాలో ఇలా జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ తప్పు జరిగే నాటికి కాకాణి వ్యవసాయశాఖ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఈ ఇదంతా బయటపడింది.
ఎఫ్టీఓలు అనుమానాస్పదం
గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు రెండు సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు అంటున్నారు. రైతులకు మద్దతు ధర అందకుండా చేయడంతో పాటు దళారులకు పుట్టికి 3500 రూపాయల వరకు ఆదాయం చేకూర్చేలా చూశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మొదటి దశలో రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. అందులో విస్తుబోయే విషయాలు బయటపడ్డాయి. 4,800 ఎఫ్.టి.ఓ (ఫోర్స్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్)లు పరిశీలించగా.. రూ.34 కోట్ల విలువైన 500 ఎఫ్.టి.ఓ. లు తప్పుగా నమోదైనట్టు తేలింది. 11 కోట్ల రూపాయల విలువైన ఎఫ్.టి.ఓలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించకుండా హోల్డ్ లో పెట్టింది. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన దళారులు ఈ ఇన్వెస్టిగేషన్ తో లబోదిబోమంటున్నారు.
Also Read : Nellore Penna Floods : పెండింగ్ లో వరద హామీలు, కష్టాల్లో నెల్లూరు ప్రజలు