నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు మరో రోజు బ్రేక్ పడింది. ఇప్పటికే వర్షాల కారణంగా ఆదివారం యాత్ర వాయిదా పడింది. రైతులంతా బస చేసిన ప్రాంతానికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం పాదయాత్ర చేపట్టిన రైతు నాయకులు నెల్లూరు నగర శివార్లలోని అంబాపురం శాలివాహన ఫంక్షన్ హాల్ లో ఉన్నారు. అయితే వర్షం తగ్గకపోవడంతో మరో రోజు కూడా యాత్రకు విరామం ఇవ్వాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. 


నెల్లూరు జిల్లాలో జోరుగా, హుషారుగా.. 
నెల్లూరు జిల్లాకు చేరుకున్నప్పటినుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర హుషారుగా సాగుతోంది. నెల్లూరు జిల్లాకు యాత్ర చేరుకున్న తర్వాత అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఓ దశలో అమరావతి యాత్రలో సంబరాలు చేసుకున్నారు రైతు నాయకులు. స్వీట్లు తినిపించుకున్నారు. అయితే వెంటనే మరో బిల్లుని అతి త్వరలో ప్రవేశ పెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో రైతు నాయకులు నిరాశకు లోనయ్యారు. ప్రభుత్వం కొత్త బిల్లు ప్రవేశ పెట్టినా, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు, అమరావతి అభివృద్ధి జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. 


అన్నిపార్టీల మద్దతు... 
వైసీపీ మినహా.. దాదాపుగా అన్ని పార్టీలు అమరావతి రైతులకు మద్దతుగా ముందుకు నడుస్తున్నారు. యాత్ర మొదలైనప్పటి నుంచి టీడీపీ వారికి అండగా నిలిచింది. యాత్ర నెల్లూరు జిల్లాకు చేరిన తర్వాత బీజేపీ కూడా నేరుగా మద్దతు తెలిపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరి సహా ఇతర కీలక నేతలు మహాపాదయాత్రలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. 


అటు జనసేన నుంచి కూడా ఊహించని మద్దతు లభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ అమరావతి రైతుల యాత్రకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా జనసైనికులు కూడా రైతులతో కలసి నడుస్తున్నారు. వామపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు కూడా యాత్రలో పాల్గొంటున్నాయి. 


విరాళాల వెల్లువ.. 
అమరావతి మహా పాదయాత్రకు స్థానికులనుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నట్టు ప్రకటించారు నేతలు. అమరావతి యాత్ర నిర్వహణకు ఈ మొత్తాన్ని వినియోగించాలని సూచిస్తున్నారు దాతలు. మరోవైపు యాత్రలో ముందుకు నడుస్తున్న మహిళలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగా బస ఏర్పాట్లు చేస్తున్నారు నాయకులు. గతంలో బస ఏర్పాటు చేయడానికి కూడా కొంతమంది పోలీసులకు భయపడేవారని, ఇప్పుడిప్పుడే తమకు మద్దతు పెరుగుతోందని చెబుతున్నారు అమరావతి జేఏసీ నాయకులు. 


వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొన్నిరోజులు అమరావతి రైతులు మహాపాదయాత్ర నిర్వహించారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటం, అందరూ తమ సొంత ఊళ్లకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడంతో.. ఆరోగ్య కారణాల దృష్ట్యా యాత్రను వాయిదా వేశారు. వర్షం తగ్గిన వెంటనే మంగళవారం నుంచి యాత్రను యధావిధిగా మొదలు పెడతామని ప్రకటించారు.