handloom weaving center in Mangalagiri: మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)లో సగమే కాదు, ఆయన ఆశయసాధనలోనూ సగమయ్యారు భార్య నారా బ్రాహ్మిణి (Nara Brahmani). ఓవైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. మరోవైపు చేనేతకి చేయూత అందించాలనే నారా లోకేష్ ప్రణాళికలకు కార్యరూపం ఇవ్వడంతో తొలి అడుగు వేశారు బ్రాహ్మిణి. చేనేతని దత్తత తీసుకుంటానన్న భర్త మాటని తన బాటగా చేసుకుని టాటా వారి సహకారంతో వీవర్‌శాల ప్రారంభించారు.
తన మంగళగిరి నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని టిడిపి యువనేత నారా లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. చేనేతల సమస్యలపై అధ్యయనం చేయించారు. యువగళం పాదయాత్రలో చేనేతల కష్టాలు, కన్నీళ్లు చూసి మరింతగా చలించిపోయారు. చేనేత రంగాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించి కొన్ని హామీలు ఇచ్చారు.
- మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్
- ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతోపాటు రుణాలు మంజూరు
- చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దు
- చేనేతలు ఎక్కువున్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ల నిర్మాణం
- ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
ఈ హామీల అమలులో భాగంగా చేనేతలకు చేయూతనందించే పైలట్ ప్రాజెక్టు తన మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టారు. మంగళగిరిలో ఇప్పటికే రాట్నాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా చేనేత పరిరక్షణే ధ్యేయంగా సత్సంకల్పంతో లోకేష్ ఆరంభించిన బృహత్తర కార్యక్రమానికి తొలి ఆశీస్సులు అమ్మ భువనేశ్వరి నుంచి లభించాయి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి గారు మంగళగిరి చేనేత చీర కట్టుకుని వచ్చి తాము చేనేతలకు, చేనేత వస్త్రాలకు ఇచ్చే ప్రాధాన్యతని చాటిచెప్పారు.
లోకేష్ కల సాకారానికి భార్య బ్రాహ్మిణి తోడు
చేనేతకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్న తన భర్త నారా లోకేష్ కల సాకారానికి భార్య బ్రాహ్మిణి తోడయ్యారు. టాటా తనేరా, ఎన్ఆర్ఐలు, చేనేతల సహకారంతో వీవర్ శాలను ప్రారంభించారు. తనేరా సీఈవో అంబుజ నారాయణ, హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నారా బ్రాహ్మిణి వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మిణి మంగళగిరి చేనేతలు నేసిన చీర కట్టుకుని, మంగళగిరి చేనేత చీరలకు విస్తృత ప్రచారం కల్పించారు.
కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న బ్రాహ్మణి
వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను, ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షెడ్‌ని పరిశీలించిన నారా బ్రాహ్మణి కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రంగులు అద్దే ప్రక్రియలో కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, కష్టానికి సరిపడా ఆదాయం లేదని చేనేత కార్మికులు వాపోయారు. పని పరిస్థితులు మెరుగుదల, వస్త్రాలకు ఆధునిక హంగులు అద్దడంలో శిక్షణ,యంత్రాల వినియోగం, ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. నేసిన చీరలకు మార్కెటింగ్, దళారీలు లేకుండా చేయగలిగితే చేనేతలకు ఆదాయం అదనంగా వస్తుందని అభిప్రాయపడ్డారు.
మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు నారా లోకేష్ ఆరంభించిన స్త్రీశక్తి శిక్షణా కేంద్రాన్ని నారా బ్రాహ్మిణి సందర్శించారు. ఇప్పటికే 47 బ్యాచ్‌లలో వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించామని నిర్వాహకులు వివరించారు. అద్భుతమైన కార్యక్రమం అని, స్త్రీశక్తిని చూస్తే ముచ్చటేస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.