Yuvagalam : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర   కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది.  మ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకుంటున్నారు. అంతేకాదు రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేశ్‌కి జనం అభివాదం చేస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను స్వయంగా నారా లోకేశ్ అడిగి తెలుసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల బాదుడు తట్టుకోలేకపోతున్నామని లోకేశ్ వద్ద మహిళలు వాపోయారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడిపై పెను భారం మోపిందని లోకేశ్ ఆరోపించారు. పెరిగిన ఖర్చులతో సామాన్యుడు బతకడం కష్టంగా మారిందని లోకేశ్ తెలిపారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
  
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసి కులాలు, కులవృత్తులను నిర్లక్ష్యం చేయడమేగాక తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కులానికొక కుర్చీలేని కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని ద్రోహం చేశాడు అని ఆరోపించారు. అమలాపురం హైస్కూలు సెంటర్‌లో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శెట్టిబలిజ సామాజిక వర్గీయులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గ జనాభా 30నుంచి 40వేల వరకు ఉన్నారని తమ సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజ కార్పొరేషన్ కు రూ. వెయ్యికోట్లు కేటాయించాలని  కోరారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా పద్ధతిన శెట్టిబలిజలకు నిధులు కేటాయిస్తాం. రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. అమలాపురంలో శెట్టిబలిజ కళ్యాణ మండపానికి స్థలం, నిధులు కేటాయిస్తామని   నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో విభిన్న ప్రతిభావంతులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. అమలాపురం ముమ్మడి వరం గేటు వద్ద విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధులు యువనేత నారా లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్‌ను రూ.3వేలు నుంచి రూ.5వేలకు పెంచాలని కోరారు. పుట్టుకతో రెండు కాళ్లు పనిచేయని వారికి పర్సంటేజ్‌తో సంబంధం లేకుండా రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలని కోరారు.  వివాహంతో సంబంధం లేకుండా 35ఏళ్లు దాటిన వికలాంగులకు ఏఏవై రేషన్ కార్డు ఇవ్వడం.. ప్రతియేటా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. వికలాంగుల రిజర్వేషన్ ను 5శాతానికి పెంచాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి. చదువుతో సంబంధం లేకుండా మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించాలని   విభిన్న ప్రతిభావంతులు కోరారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ వారితో పలు అంశాలపై చర్చించారు. వైసీపీ హయాంలో పర్సంటేజీల పేరుతో పెన్షన్లు కూడా తొలగించారు అని ఆరోపించారు. దివ్యాంగులకు సబ్సిడీ లోన్లు నిలిపేసి ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు కూడా అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉండటం దురదృష్టకరమని లోకేశ్ ఎద్దేవా చేశారు సొంతిళ్లు లేని దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతుల రిజర్వేషన్లు చేయడంతోపాటు వివాహ ప్రోత్సాహకాలను పునరుద్ధరిస్తామన్నారు. మానసిక విభిన్నప్రతిభావంతులకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులకు ఆసక్తి ఉన్నరంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


వైఎస్ జగన్‌ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఈ రోజు యాత్ర కొనసాగనుంది. ఇటీవల వైసీపీకు రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆక్వారైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వారైతులు, తమ ఆవేదనను లోకేశ్‌తో చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.