దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు అంటే సీఎం జగన్‌కు చిన్న చూపని అన్నారు.  నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను భారత్‌కు పరిచయం చేసింది టీడీపీనే అని చెప్పారు. పేదలకు సీఎం జగన్ చేసిందేమీ లేదని, ఆయన పేదలకి ఇచ్చిన 3 లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టు జగన్ 3 లక్షల ఇళ్లు పూర్తి చేయాలంటే సీఎం జగన్ 100 జన్మలు ఎత్తాలని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఒంగోలు నగరంలో టీడీపీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో నారా లోకేశ్‌ మాట్లాడారు.


బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశామని, జగనన్న పాలనలో రోడ్లపై గుంతల రాజ్యం చూస్తున్నామని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారని ఎగతాళి చేశారు. సీఎం జగన్ కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం రావడం లేదని.. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌ అని ఆక్షేపించారు. జగన్‌ దగ్గర రెండు బటన్లు మాత్రం ఉంటాయని.. ఒకటి బల్లపైన బ్లూ బటన్‌, రెండోది బల్ల కింద రెడ్‌ బటన్‌ ఉంటుందని అన్నారు. మహిళలకు జగన్‌ ఇచ్చిన  హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తెదేపా తీసుకుంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెండు రెట్లు అయిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.