Nara Lokesh slams AP Home Minister Taneti Vanitha : ఏపీలో వరుస అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజయనగరంలో మహిళపై అత్యాచారం ఘటనపై లోకేష్ ఘాటుగా స్పందించారు. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.


ఏపీలో వరుస అత్యాచార ఘటనలు..
ఇటీవల ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే నాలుగైదు చోట్ల అత్యాచారాలు జరిగాయి. కొన్ని కేసులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోరంపై.. అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయ్ అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత  మాట్లాడటం అన్యాయం అన్నారు. ఇన్ని దారుణాలు జరిగినా మీ మనస్సు కరగదా అన్నారు. విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చెర్రీ తన స్నేహితులతో కలిసి వివాహితపై అమానవీయంగా దాడి చేసి పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డటం దారుణం అన్నారు. 


జే బ్రాండ్ లిక్కర్ తాగి వివాహితపై అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని ఏపీ పోలీసులను డిమాండ్ చేశారు. గాయపడిన మహిళకి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాన్ని సత్వరమే ఆదుకోవాలని నారా లోకేష్ కోరారు. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న  అఘాయిత్యాల ఘటనలు చూస్తే.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. దిశ చట్టం పేరుతో చేసిన మోసం చాలని, మహిళలు బయటకి రావాలంటేనే భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను టీడీపీ నేత నారా లోకేష్ కోరారు.


మంత్రి తానేటి వనిత ఏమన్నారంటే..
ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రేపల్లె అత్యాచార ఘటనపై ఇటీవల ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడమే అత్యాచారాలకు కారణమని వ్యాఖ్యానించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడే ఉద్దేశంతో రాలేదన్నారు. మద్యం మత్తులో ఉన్న వారు డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారని, ఈ క్రమంలోనే వివాహితపై అత్యాచారం జరిగిందన్నారు. అయితే సమస్య గురించి మాట్లాడితే తల్లిదండ్రులను బాధ్యుల్ని చేసి మాట్లాడటం సరికాదని ఆమెపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. 


వివాహితపై అత్యాచారం ఘటనపై స్పందించిన మంత్రి తానేటి వనిత.. పేదరికం వల్లనో, మానసిక పరిస్థితుల వల్లనో అత్యాచారాలు జరుగుతాయి అన్నారు. కొన్ని అత్యాచారాలు అలా జరుగుతుంటాయి అని మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జీవనోపాధి కోసం వేరే జిల్లా నుంచి విజయనగరానికి వలస వచ్చిన ఆమె పిల్లలతో కలిసి ఉంటోంది. టీ దుకాణంలో పనిచేసే మహిళ ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఉన్న మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.


Also Read: Crime News: విజయనగరంలో అర్థరాత్రి అత్యాచారం- పోలీసులు విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి బాధితురాలు షాక్!


ఏపీ, తెలంగాణ సహా ఇతర సెక్షన్స్‌లో మరిన్ని లేటెస్ట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి