Nara Lokesh About Pegasus spyware: ఇజ్రాయెల్‌కు చెందిన వివాదాస్పద పెగాసస్‌ స్పైవేర్‌ను కొన్నేళ్ల కిందట చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారని ప్రచారం జరుగుతోంది. మొదట ఎన్‌ఎస్‌వో సంస్థ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆఫర్ చేయగా, తాము దాన్ని కొనలేదని గురువారం చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం ఇష్టంలేని కారణంగా మాకు ఆ సాఫ్ట్‌వేర్ అవసరం లేదని చెప్పినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు.


పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. మమతా ఆరోపణల్లో వాస్తవం లేదని గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించిన లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఏ స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదని, . అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని గురువారం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కొందరు ఆమెకు తప్పుడు సమాచారం అందించి ఉంటారు. ఆమె ఆరోపణలు నిజమనుకుంటే.. తాము అలాంటి స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌లను ఆశ్రయించి ఉంటే వైఎస్ జగన్ 2019లో సీఎం అయ్యేవారా, అధికారంలోకి వచ్చేవారు కాదని నారా లోకేష్ అన్నారు.


మమత అలా మాట్లాడారా..
మమతా బెనర్జీ ఏ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేశారో, ఎక్కడ చేశారో మాకు అయితే వివరాలు లేవు. కానీ చంద్రబాబు హయాంలో మేం పెగాసస్ ను ఆశ్రయించామని ఆమె వ్యాఖ్యానించినట్లయితే అందులో వాస్తవం లేదని, ఇది కచ్చితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఆరోపణలు అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులకు ఎప్పుడూ పాల్పడరని, ఆయనకు ఇలాంటి వాటి అవసరం లేదన్నారు.


పెగాసస్  స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ప్రభుత్వానికి విక్రయించడానికి ఆఫర్ చేయడం నిజమేననీ, కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ ఆఫర్‌ను మరో ఆలోచన లేకుండా తిరస్కరించిందని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తమ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లయితే అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద రికార్డులు ఉంటాయన్నారు. వ్యవస్థలను నమ్మే నేత చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడరని రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు.


జగన్ ప్రభుత్వం మమ్మల్ని విడిచిపెట్టేదా..
ఒకవేళ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు హయాంలో కొనుగోలు చేసిన వాడినట్లయితే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తమల్ని విడిచిపెట్టేది కాదని లోకేష్ అన్నారు. తాము ఏ తప్పు చేయలేదు కనుక గత మూడేళ్లలో తమపై ఏ ఆరోపణల్ని ఏపీ ప్రభుత్వం నిరూపితం చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ శాఖకు చెందిన అన్ని ఫైల్స్, డాక్యుమెంట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మేం ఏదైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇప్పటికే బహిర్గతం అయ్యేది.


చంద్రబాబు పాలనలో విశ్వసనీయమైన, పారదర్శకమైన సీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించారని, అది ఇప్పుడు విజయం సాధించిందని లోకేశ్ గుర్తుచేశారు. ఏపీ రాజధానిపై వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ టీడీపీ మాత్రం ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని’ అనే క్లియర్ కట్ విధానంపై పాలన సాగించిందన్నారు. జంగారెడ్డిగూడెం అక్రమ మద్యం మరణాలపై చర్చ జరగకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని ఆరోపించారు. అంత విషాదం జరిగినా సహజ మరణాలు అని కల్తీ సారా మరణాలను ప్రకటించడం దారుణమన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి ప్రమోషన్లు ఇచ్చారంటూ టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, ప్రధానిలకే అబద్దాలు చెప్పగలిగిన ఘనుడు సీఎం జగన్ అన్నారు.