Nara Lokesh News | అమరావతి: టీచర్ పోస్టుల పోస్టుల భర్తీపై అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీచేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.


టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేత


ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదన్న మంత్రి నారా లోకేష్ టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసినపుడు ఉపాధ్యాయులపై దొంగకేసులు పెట్టారని, డిజిపితో మాట్లాడి ఆ కేసులన్నీ తొలగిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం చంద్రబాబు వద్ద ఉందన్నారు. అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామని నారా లోకేష్ చెప్పారు.


1994కి ముందు జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్ మెంట్ జరిగేది. ఆ తర్వాత టిడిపి ప్రభుత్వాల హయాంలోనే 15 డిఎస్సీలు నిర్వహించాం, 2.20లక్షల పోస్టులు నోటిఫై చేసి, 1.80లక్షల పోస్టులు భర్తీచేసింది మా ప్రభుత్వాలే. ఇదొక చరిత్ర. గత వైసిపి ప్రభుత్వ హయాంలో డిఎస్సీ ద్వారా భర్తీచేసిన పోస్టులు సున్నా. ఎన్నికలకు రెండునెలల ముందు 12-2-2024న నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హయావిడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు అన్నారు.


Also Read: AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!



ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికే వైసీపీ నోటిఫికేషన్


‘నిరుద్యోగులను మభ్యపెట్టడానికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం జిఓ 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం వాస్తవం కాదా. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ (AP Model Education) తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వాములను చేయాలి. గత ప్రభుత్వంలో అయిదేళ్ల వ్యవధిలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని గుర్తించాం. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచకపోగా ఉపాధ్యాయులను వేధించారు. 


Also Read: Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన


జిఓ 117పై ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతున్నారు, గతంలో ఏం జరిగిందో కూటమి ప్రభుత్వం వాస్తవాలను తెలుసుకుంటోంది. జిఓ 117కి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటాం. ఏ ప్రభుత్వంలోనైనా సరే సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయులపై వేధింపులు సరికాదు. వైసీపీ పాలనలో తమ సమస్యలపై ధర్నాలు చేసినపుడు టీచర్లపై పెట్టిన కేసులపై ఏపీ డీజీపీతో మాట్లాడి వాటిని తొలగిస్తాం. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామం’ - అసెంబ్లీలో నారా లోకేష్