Nara Lokesh Tries to relocate Black Buck to Vizag from Bengaluru | అమరావతి: బెంగళూరులో భారీ వర్షాలు, ట్రాఫిక్ సమస్యలు, రహదారుల్లో గుంతలు ప్రతి వర్షాకాలంలో జాతీయ స్థాయిలో చర్చకు తెరతీస్తుంటాయి. ఇటీవల ‘‘బ్లాక్‌బక్’’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ చేసిన ఒక ట్వీట్ కర్ణాటక వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ విషయం జాతీయ స్థాయిలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. బ్లాక్ బక్ కంపెనీ సీఈవో "రోడ్లు గుంతలతో నిండిపోయి, దుమ్ముతో ఉన్న రోడ్లతో విసిగిపోయాను. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. గత ఐదేళ్లుగా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు కూడా కనిపించడం లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంటనున్నా" అని రాజేశ్ యాబాజీ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి కర్ణాటక ప్రభుత్వ నుంచి "బ్లాక్‌మెయిల్" అనే తరహాలో సమాధానం వచ్చింది.
విశాఖకు రావాలని ఆహ్వానించిన నారా లోకేష్
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీని విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. ‘‘హాయ్ రాజేశ్, మీ కంపెనీని విశాఖకి తరలించేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను. భారతదేశంలోని టాప్ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖపట్నం ఒకటి కాబట్టి, ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. అదేవిధంగా, మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ గుర్తింపు పొందింది. ఈ విషయంలో ఏమైనా సాయం కావలంటే దయచేసి నన్ను నేరుగా సంప్రదించండి’’ అని ఎక్స్ వేదికగా నారా లోకేష్ పోస్ట్ చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ అన్న పదాలు ప్రభుత్వం పట్టించుకోదు అని వ్యాఖ్యానించారు. బెంగళూరు సిటీ ప్రపంచస్థాయి సంస్థలకు ఆకర్షణీయంగా ఉందని, రోడ్డు మరమ్మతుల కోసం రూ. 1,100 కోట్లను కేటాయించామని చెప్పారు. అలాగే, కాంట్రాక్టర్లకు నవంబర్ చివరి వరకు గడువు ఇచ్చామని, ఎవరి బ్లాక్ మెయిల్ కు మేం భయపడేది లేదన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. ‘ఇతర రాష్ట్రాలకు, ప్రత్యేకంగా ఏపీకి ఉన్న తేడా ఇదే. మా ప్రజల ఫిర్యాదులను మేము పట్టించుకుంటాం. కానీ బ్లాక్‌మెయిల్ అని పదాలు వాడుతూ తోసిపుచ్చం. మేం వారి ఫిర్యాదులను, అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం’’ అని నారా లోకేష్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు.
బ్లాక్ బక్ సీఈవో ఏమన్నారంటే..గత 9 సంవత్సరాలుగా ORR (బెల్లందూర్) మా ఇల్లు, ఆఫీసుగా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ కొనసాగడం చాలా కష్టంగా మారింది. మేం బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. గత కొంతకాలం నుచి నా సహోద్యోగుల సగటు ప్రయాణ సమయం 1.5+ గంటలకు పెరిగింది (కేవలం ఒకవైపు ప్రయాణం). గుంతలు, దుమ్ముతో నిండిన రోడ్లు, వాటిని సరిదిద్దాలనే ఉద్దేశ్యం తక్కువగా ఉండటంతో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నాకు ఏ మార్పు కనిపించలేదు అని రాజేశ్ యాబాజీ తన పోస్టులో రాసుకొచ్చారు.