Nara Lokesh: సీఐడీ నోటుసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో ఏ14గా ఉన్న లోకేశ్.. రాష్ట్రం నుంచి ఢిల్లీకి పరారయ్యారని, 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్తే.. లోకేశ్ తప్పించుకు తిరుగుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. సీఐడీ టీమ్ కి దొరక్కుండా లోకేశ్ దాగుడుమూతలు ఆడుతున్నారని, మీడియా కళ్లుగప్పి కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఐటీసీ మౌర్య నుంచి మరో చోటుకు మకాం మార్చారని, గల్లా జయదేవ్ ఇంటికి కూడా రావడం లేదని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు చేస్తున్న ఈ ఆరోపణలపై తాజాగా నారా లోకేశ్ స్పందించారు.


పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో సీఐడీ నోటీసుల గురించి చర్చించారు. తాను సీఐడీ నోటీసులు తీసుకుంటానని నేతలకు స్పష్టం చేశారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని.. ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నానని లోకేశ్ వెల్లడించారు. ప్రతి రోజూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. 50 అశోక రోడ్ లో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలిపారు.


తాను ఎక్కడికీ పోలేదని, సీఐడీ వాళ్లు ఎవరూ తన వద్దకు రాలేదని చెప్పారు లోకేశ్. సీఐడీ వాళ్లు వస్తే నోటీసులు తీసుకుంటానని, తనకు దాక్కునే అలవాటు లేదని వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నాను అనేది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేశ్ చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్ తో సహా చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.


గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహారదీక్ష


టీడీపీ అధినేత  చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు.  నంద్యాలలో  చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. ఆ రోజు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్‌ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.