Nara Lokesh Tamilnadu Tour: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది. తమిళనాడులో కాస్త ఎక్కువగా తెలుగు వారు ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేశ్ తో బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. అందుకోసం లోకేశ్ గురువారం (ఏప్రిల్ 11) మధ్యాహ్నం దాటాక కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లోకేశ్ కోయంబత్తూరుకు వెళ్లారు.


తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన వారు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో నారా లోకేశ్ ప్రచారం చేయడం ద్వారా వారిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదీకాక కోయంబత్తూర్ సీటును ఎన్డీయే కూటమి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పేరెన్నికగన్న బీజేపీ నేతలు, ఎన్డీయే పక్షాల లీడర్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలోనే లోకేశ్ కూడా అన్నామలైకు మద్దతుగా ఏప్రిల్ 11, 12 తేదీల్లో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.


తొలి రోజు ఏప్రిల్ 11న రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొనబోతున్నారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో అక్కడి తెలుగు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశం కానున్నారు. అన్నామలైని గెలిపించాలని వారిని కోరనున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత మామూలుగా మంగళగిరి నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నారా లోకేశ్ పాల్గొనబోతున్నారు.