Nara Lokesh: యువ‌గ‌ళం పేరు వింటేనే సైకో జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చినా యువగళాన్ని ఆపలేకపోయారని చెప్పుకొచ్చారు. ప్రజల సహకారంతో యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించిందన్నారు. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా జ‌న‌జైత్ర యాత్ర‌గా ముందుకు సాగిందని గుర్తు చేశారు. మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌ని చెప్పగానే.. తన శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో తనను ఏ14గా చేర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేర్ల పేరుతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బ్రిడ్జి మూసేయించారని ఆరోపించారు. సీఎం జగన్ తనపై ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా, అక్ర‌మ అరెస్టులు చేసినా తన యువగళం పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. 


అలాగే విజయనగరం కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై  పోలీసులు ప్రదర్శించిన దాష్టీకాన్ని ఖండిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. నిర్దాక్షిణ్యంగా బట్టలూడదీసి మరీ విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన పోలీసుల తీరు దారుణం అంటూ మండిపడ్డారు. కొట్టండి, లోపలేయండి అంటూ పోలీసులకు హుకూం జారీ చేస్తూ చెలరేగిపోయిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 






అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సీఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సీఎం జగన్ జడుసుకుంటున్నాడని అన్నారు. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనాన్ని చాటి చెబుతుందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన అంగన్ వాడీలపై సోమవారం పోలీసుల నిర్బంధం తీరు నిర్ఘాంత పరిచిందని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్ తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.