TDP Leader Nara Lokesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్ట పోయింది రైతులే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్ని వర్గాల వాళ్లను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అందరికంటే ఎక్కువగా అన్నదాతలనే నాశనం చేశారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలంతా ఆయనకు బుద్ధి చెప్పాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోట, రాజోలి జలాయశం ముంపు వాసులు సమస్సయలను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. 


యువగళం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా జమ్మలమడుగు నియోజక వర్గంలోని పెద్ద ముడియం మండలం సుద్దపల్లిలో రైతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గండికోట, రాజోలి జలాయశాయల సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో నష్ట పోయిన అన్నదాతలకు పది లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మాట ఇచ్చిన సీఎం... కొందరికే నష్ట పరిహారం ఇచ్చారని అన్నారు.


బండికి అడ్డంగా పడుకున్న రైతుల కోసం బండి కూడా ఆపలేరు..


"పోలవరం తీస్కోండి, గండికోట తీస్కోండి, రాజోలి తీస్కోండి. ఎన్నికల ముందట అబద్ధాలు తియ్యగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నడివీధిపై వదిలేసి వెళ్లిపోయాడు సీఎం. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పర్యటించినప్పుడు పరధాలు కడ్తరు. చెట్లను నరికేస్తరు. ఎక్కడ రైతులు రోడ్డుపైకి వస్తారో.. ఎక్కడ మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తరో అనే అనుమానంతో బతుకుతున్నడు జగన్. మొన్న చూశాం. హెలికాప్టర్ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి రోడ్డు మీద వెళ్తుంటే.. అప్పటికప్పుడు తెలుసుకన్న రైతులు ఒక ఐదుగురో, ఆరుగురో సాహసం చేసి ముఖ్యమంత్రి గారి బండికి అడ్డంగా పడుకున్నరు.


అయ్యా మీరు నాకు న్యాయం చేస్తా అన్నరు. ఏమాయే న్యాయం అని అడిగినందుకు పోలీసును పెట్టుకొని ఈడ్చుకొని ఎళ్లిపోయారు. పెద్ద మనసు ఉందని చెప్పుకుంటాడే కనీసం ఆగలా.. ఆగి మీ సమస్య ఏంటి, కాగితం ఇవ్వండి, నేను కనుక్కుంటా అని అడగలేకపోయాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువగా నష్టపోయింది రైతులే." - నారా లోకేష్


12 లక్షలు ఇస్తామని.. ఎలాంటి నిధులూ మంజూరు చేయలేదు..!


ముఖ్యంగా రాజోలి జలాశయం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుల సమస్యలన్నింటికీ సానుకూలంగా స్పందించిన వాళ్లందరికీ భరోసా ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు తీరుస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే వైఎస్సార్ జిల్లాలోని ప్రజలందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.


ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ మాయ మాటలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని.. కానీ వచ్చే ఎన్నికల్లలో ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా తమకే అధికారం కట్టబెడతారని జోస్యం చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు.