Nara Lokesh Election Campaign: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 11 నుంచి 'శంఖారావం' (Shankaravam) పేరిట క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు 'శంఖారావం'పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఈ 'శంఖారావం' ప్రారంభం అవుతుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. 'ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే 'శంఖారావం' లక్ష్యం. ప్రతి రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది. ఈ నెల 11న ఇచ్ఛాపురంలో తొలిసభ నిర్వహిస్తాం. సీఎం జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం.' అని అచ్చెన్నాయుడు వివరించారు.
త్వరలోనే చంద్రబాబు రోడ్ షో
'రా.. కదలిరా' సభలు ముగిశాయని.. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో యువగళం పాదయాత్ర అనుకున్న విధంగా ముందుకు సాగలేదని.. 'శంఖారావం' ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలు మొత్తం చుట్టివచ్చేలా భారీ బహిరంగ సభల్లో ప్రజలతో లోకేశ్ మమేకం కానున్నారని చెప్పారు. '120 నియోజకవర్గాల్లో 40 రోజులు శంఖారావం కొనసాగుతుంది. తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ పున:ప్రారంభమై ఎక్కడ మళ్లీ తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో సీఎం జగన్ వణికిపోతున్నాడు. జగన్ రెడ్డి, వైసీపీనేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా నిర్వాహకులు పెద్ద ఫేక్ ఫెలోస్. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఫేక్ ఫెలోస్ కు బుద్ధి చెబుతాం. కోడి కత్తి శ్రీనివాస్ కు బెయిల్ రావడం నిజంగా సంతోషకరం. అమాయకుడిని రక్షించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకున్న గౌరవం మరింత పెరిగింది.' అని అచ్చెన్న అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అరాచక.. విధ్వంస పాలనపై గళమెత్తుతూ గతంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల్లో కొత్త చైతన్యం రేకెత్తించిందని అచ్చెన్నాయుడు అన్నారు. అధికార పార్టీ నేతల అవినీతి, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎండగడుతూ 222 రోజుల పాటు, 3,132 కిలోమీటర్లు సాగిన యువగళం పాదయాత్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని, ప్రజలకు అండగా నేనున్నాను అనే భరోసా ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్ పాద యాత్ర జైత్రయాత్రలా సాగిందని చెప్పారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ పేరిట టీడీపీ ప్రకటించిన పథకాలను లోకేశ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని అన్నారు. 'ప్రధానంగా సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రకటించిన 6 హామీలపై విస్తృత ప్రచారం చేయబోతున్నాం. శంఖారావం కార్యక్రమం నారా లోకేశను పార్టీ యంత్రాంగానికి మరింత చేరువ చేస్తుంది. నేతలు, కార్యకర్తలతో ఆయన స్వయంగా సమావేశమై వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటారు. ప్రజలతో సైతం విస్తతంగా మమేకమవుతారు.' అని అచ్చెన్నాయుడు వివరించారు.