'సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!' అన్నట్లు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
'అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి, పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీడీపీ కార్యకర్తలపై దాడి చేశాడు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న వారి చొక్కాలు విప్పించి, టీడీపీ జెండాలు పీకి దాడికి తెగబడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.' అంటూ లోకేశ్ ట్విట్టర్ లో తెలిపారు.






'అధికారం అందుకేనా జగన్?'


'ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల జెండాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్.?' అంటూ లోకేశ్ నిలదీశారు. 'వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.' అంటూ లోకేశ్ మండిపడ్డారు. 


నేతలతో లోకేశ్ సమావేశం


మరోవైపు, నారా లోకేశ్ అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నేతలు సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలకు టీడీపీ శ్రేణుల్ని, జనసేన సమన్వయంతో సిద్ధం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, నారా భువనేశ్వరి బస్సు యాత్ర, బాబుతో నేను వంటి కార్యక్రమాల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.


టీడీపీ - జనసేన తొలి భేటీ ఎప్పుడంటే.?


అలాగే, టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ముమ్మరం చేసేందుకు వేగంగా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ 2 పార్టీల సమన్వయం కోసం ఏర్పాటైన కమిటీ తొలిసారి భేటీ కానుంది. ఈ నెల 23న రాజమండ్రిలో లోకేశ్ - పవన్ అధ్యక్షతన ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు వంటి వాటిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కాగా, టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీల సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల్లో జోష్ నెలకొంది.


Also Read: జనసేన నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడి-వైఎస్‌ఆర్‌సీపీ పనే అంటూ ఆరోపణలు