వైసీపీ నేతలు ఎందుకంత భయపడుతున్నారని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఇటీవల మృతి చెందిన నిరుద్యోగి కమల్ కు నారా లోకేశ్, టీడీపీ ముఖ్య నేతలు నివాళులర్పించారు. అధికారులు, మంత్రి, వైసీపీ నేతలే కమల్ కుటుంబాన్ని మాయం చేశారన్నారు. రాత్రి వరకూ తమ కుటుంబానికి కలిగిన కష్టం ఇంకెవరికి కలగకూడదని.. ఇంకో కుర్రాడు ఆత్మహత్య చేసుకోకూడదని బాధపడిన కమల్ కుటుంబాన్ని రాత్రే మాయం చెయ్యడం దారుణమన్నారు. కమల్ కుటుంబాన్ని మాయం చేసిన వైసీపీ నేతలు చనిపోయిన కమల్ ని తిరిగి తీసుకురాగలరా? అని లోకేశ్ ప్రశ్నించారు.
'వైసీపీ నాయకులు పిరికివాళ్లు అందుకే కమల్ కుటుంబాన్ని మాయం చేశారు. నేను పరామర్శకి వస్తే నిజాలు బయటపడతాయి అని భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇంటర్నేషనల్ యూత్ డే జరుపుకొంటుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబాలను పరామర్శించాల్సిన పరిస్థితి ఉంది. యువతకి ఉన్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి ఇంటర్నేషనల్ యూత్ డే ఒక గొప్ప అవకాశం. కానీ మన రాష్ట్రంలో సమస్యలు చెప్పుకుందాం అంటే వినే నాథుడే లేడు.' అని లోకేశ్ విమర్శించారు.
నిరుద్యోగ సమస్యతో రాష్ట్రంలో ఉన్న యువకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి గారు ఫ్యాన్ గిర్రున తిప్పి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఇప్పుడు అదే ఫ్యాన్ కి నిరుద్యోగులు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాట మార్చి, మడమ తిప్పిన జగన్ రెడ్డి రెండేళ్ల తరువాత 10 వేల ఉద్యోగాలు.. వేస్తున్నా పండగ చేస్కోండి అంటూ ఫేక్ క్యాలెండర్ వదిలారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 10 వేల ఉద్యోగాలు ఎక్కడ? అందుకే ఆయన్ని నేను జగన్ రెడ్డి అనడం లేదు ఫేక్ రెడ్డి అంటున్నా.
- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో మీరు వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకిచ్చిన 2000 నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలన్నారు.