నారా లోకేశ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎర్రబాడుకు చేరుకొని ఏడాది క్రితం హత్యకు గురైన హజీరా కుటుంబాన్ని పరామర్శించారు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారని మండిపడ్డారు. వివేకా కుమార్తెకు రాష్ట్రంలో భద్రత లేదని అన్నారు.
ఎర్రబాడులో హజీరాను హత్య చేసి ఏడాది అయ్యిందని నారా లోకేశ్ అన్నారు. 21 రోజుల దిశ చట్టం ఎక్కడ? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పొలంకి వెళ్ళొస్తానని తల్లికి చెప్పి వెళ్లిన అమ్మాయిని దారుణంగా చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు లోకేశ్ తెలిపారు. తల్లి బాధ మీకు పట్టదా జగన్ రెడ్డి గారు?తాడేపల్లి కొంపలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదు. జగన్ ఒక బుల్లెట్ లేని గన్ అని తేలిపోయింది. జగన్ రెడ్డి గారి ప్యాలస్ పక్కన మహిళ పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోయారు. సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.
- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
అంతకుముందు కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి లోకేశ్ నివాళులర్పించారు. టీడీపీ నేతల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలో లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
- హోంమంత్రి గారు మహిళల్ని హత్య చేసే హక్కు ఎవరిచ్చారు.. అని అమాయకంగా అడుగుతున్నారు. ఆ మాట విన్న తరువాత నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారు.
- నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా రెండేళ్ల మీ పరిపాలనలో ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందా?
- దిశ చట్టం అన్నారు,21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు?ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా?
- దిశ చట్టం,దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు.కేంద్రమేమో అసలు ఆ చట్టమే లేదంటుంది.
- విచిత్రం ఏంటంటే వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.
- దిశ చట్టం పై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది.
Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట