Chandrababu Naidu Bail: న్యాయస్థానంలో స‌త్యం గెలిచిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు (Skill Development Case)లో బెయిల్ మంజూరు అవడంపై నారా లోకేష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ‘స‌త్యమేవ‌ జ‌య‌తే’ మ‌రోసారి నిరూపిత‌మైందని అన్నారు. కుట్రలు కుతంత్రాలు ఓడిపోయాయని, ఆల‌స్యమైనా న్యాయస్థానంలో స‌త్యమే గెలిచిందన్నారు. జ‌గ‌న్ (YS Jagan) క‌నుసన్నల్లో వ్యవ‌స్థల మేనేజ్‌మెంట్‌పై నిజం గెలిచిందని చెప్పారు. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మ‌రోసారి స‌మున్నతంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డిందన్నారు.  


‘త‌ప్పు చేయ‌ను, త‌ప్పు చేయ‌నివ్వను’ అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పేమాట  మ‌రోసారి నిజ‌మైందని లోకేష్ అన్నారు. చంద్రబాబుపై పెట్టిన‌ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు, జ‌గ‌న్ కోసం, వ్యవ‌స్థల ద్వారా బ‌నాయించింద‌ని విమర్శించారు. అరెస్టు చేసి 50 రోజుల‌కి పైగా జైలులో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచ‌లేక‌పోయిన త‌ప్పుడు కుట్రలు న్యాయం ముందు బ‌ద్దల‌య్యాయని అన్నారు. కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు అనేవి లేవ‌ని తేలిపోయిందని లోకేష్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు ప‌డ్డాయ‌నేది ప‌చ్చి అబ‌ద్ధమ‌ని,  వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూట‌క‌మ‌ని స్పష్టమైందని చెప్పారు.


 చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చార‌నేది అవాస్తవ‌మ‌ని, ఈ విషయాన్ని న్యాయ‌స్థానమే తేల్చేసిందని అన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్రబాబు 45 ఏళ్ల క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో  ప‌న్నాగ‌మ‌ని దేశ‌మంత‌టికీ తెలిసిందని విమర్శించారు. హైకోర్టు వ్యాఖ్యల‌తో క‌డిగిన ముత్యంలా బాబు ఈ కుట్రకేసుల‌న్నింటినీ జ‌యిస్తారని అన్నారు. జ‌గ‌న్ అనే అస‌త్యంపై యుద్ధం ఆరంభం అవుతుందన్నారు.


చంద్రబాబుకు బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్డు తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభలు, ప్రెస్ మీట్లలో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. 


అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని సూచించారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా పలుమార్లు బెయిల్ పై విచారణలు వాయిదా పడ్డాయి. అనంతరం, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు చికిత్స కోసం అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉండగా పూర్తి బెయిల్ మంజూరైంది.