Nara lokesh: స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఆయనతో ములాఖత్ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరమంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశమన్న ఆయన, ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోన్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని, అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లి విరియాలని ఆకాంక్షించారు.
బ్రాహ్మణి ట్వీట్
మరోవైపు నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ట్వీట్ చేశారు. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి అని అన్నారు. 'దేశం చేస్తోంది రావణ దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం' అన్న పోస్టర్‌ను బ్రాహ్మణి జత చేశారు. మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసిందని, విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి అని అన్నారు. కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడదాం అంటూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.
స్కిల్ స్కాం కేసు వివరాలు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్ టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది.