Lokesh :   బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వ అక్రమ కేసులు, నిర్భంధాలు ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.  చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా చేస్తున్న నిరాహారదీక్ష లు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. ల  టీడీపీ అధినేతకు సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైనా కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు.  ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తీరు చూస్తుంటే సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది అనేలా ఉన్నారన్నారు.                           
 
శాంతియుత నిరసనలూ జరగడానికి వీల్లేదని సీఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి అదేశాలు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.  ప్రజా స్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు.   పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఎపిలోనే ఎందుకు? పక్కన ఉన్న తెలంగాణ లో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలో ఎందుకో సైకో సర్కార్ సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని....ఈ ప్రభుత్వం తుప్పు పట్టిన అక్రమ కేసుల విధానంతో ఇక అడ్డుకోలేదని హెచ్చరించారు.                                   

  


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు చేపడుతూ నిరసన తెలియచేస్తున్నారు. ఐ యామ్ విత్ బాబు పేరుతో  ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుచోట్ల తెలుగు తమ్ముళ్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు ఆందోళనలను అడ్డుకుంటున్నారు.         


టీడీపీ శ్రేణుల నిరసనలకు సంబంధించి తాజాగా ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ముందుగా అనుమతి తీసుకుని, ఆ తర్వాతే నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని సూచిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసులు నమోదైతే యువతకు ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని హెచ్చరించారు.


శాంతియుత నిరసనలపైనా ఉక్కుపాదం మోపుతూండటంపై టీడీపీ మండిపడుతోంది.